రేషన్ సరుకులు ఇక ఇంటి వద్దకే

ఏపీ సర్కారు ప్రజా సంక్షేమ పథకాల్లో ప్రత్యేకతను చాటుకుంటోంది. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎన్నికల హామీలను అమలుచేసి ప్రజా ప్రయోజనాలకు పెద్దపీఠ వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకంతో ముందుకు రాబోతోంది. నిత్యావసర సరుకుల కోసం రేషన్ షాపుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటి వద్దకే చేర్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఒకే పథకంగా బహుళ ప్రయోజనాలు అందించడం ఈ స్కీమ్ ప్రత్యేకత.

ఇంటి వద్దే రేషన్ సరుకులు అందించే ఈ పథకం ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 9,260 వాహానాల ద్వారా ఇంటింటికీ రేషన్ అందించనుంది ప్రభుత్వం. ట్రక్కుల్లోనే సరుకులను తూచి లబ్దిదారులకు అందజేయనున్నారు. అందుకు తగినట్లుగా ట్రక్కుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చౌక ధరల డిపోల నుంచి సరుకులు రవాణా చేసే ఈ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు.

విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద వైఎస్ జగన్ 2,503 వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి వాహనాలను కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పంపిస్తారు. నెలాఖరు వరకు బియ్యం పంపిణీ వాహనాలను పౌర సరఫరాల శాఖ గిడ్డంగులకు కేటాయిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి లబ్దిదారులకు రేషన్ అందిస్తారు. ఏజెన్సీ ప్రాంతాలు, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు సైతం రేషన్ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.

ఈ పథకం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో వినూత్న మార్పులకు తెరతీయనుంది ఏపీ సర్కారు. ఈ పథకం కింద ప్రతినెలా 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నది ప్రభుత్వం. ఇంటి వద్దకే రేషన్ అందించే ఈ పథకం కింద నిత్యావసర సరుకులు సరఫరా చేసే వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించనున్నారు. ఆయా వర్గాలకు చెందిన వారికి సబ్సిడీ మీద వాహనాలు అందిస్తోంది ప్రభుత్వం. ఇంటి ముంగిటే సరుకులు పొందే అవకాశంతో పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుండడంతో ఈ పథకం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.