సీనియర్ నిర్మాత దొరస్వామి రాజు మృతి

ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి రాజు ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా
అస్వస్థతతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. చిత్ర
నిర్మాతగానే కాకుండా, రాజకీయాల్లో కూడా రాణించారు. నగరి ఎమ్మెల్యే గా పనిచేశారు. అలాగే టిటిడి బోర్డు
సభ్యులుగా, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా పనిచేశారు.

టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్-ఎగ్జిబిటర్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగారు దొరస్వామి. పలు బ్లాక్ బస్టర్
సినిమాలతో పాటు టెలీసీరియల్స్, డబ్బింగ్ సినిమాలు కూడా చేశారు. 1978లో ఎన్టీఆర్ చేతుల మీదుగా
వీఎంసీ బ్యానర్ ప్రారంభించారు దొరస్వామి. ఏఎన్నార్ హీరోగా దొరస్వామి నిర్మించిన సీతారామయ్యగారి
మనవరాలు సినిమా సూపర్ హిట్టవ్వడంతో పాటు జాతీయ అవార్డ్ దక్కించుకుంది. ఇక నాగార్జున కెరీర్ లో
మరపురాని చిత్రంగా నిలిచిన అన్నమయ్యను కూడా ఈయనే నిర్మించారు.

ఆయన తన బ్యానర్ లో అక్కినేని నాగార్జునతో 3, ఏఎన్నార్ తో 2, ఎన్టీఆర్ తో ఒక సినిమా నిర్మించారు. సీతారామయ్య గారి మానవరాలు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి, భలే పెళ్లాం, వెంగమంబ లాంటి చిత్రాలు ఈయన బ్యానర్ పై వచ్చాయి.