Telugu Global
National

బెంగాల్ లో 'ఎ' టీమ్ లు.. 'బి' టీమ్ లు

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ పోరు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతోంది. అధికార టీఎంసీ వ్యూహాలకు బీజేపీ ప్రతి వ్యూహాలను రచిస్తోంది. బీజేపీ ఎత్తుగడలను అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఎంఐఎం ప్రకటించగానే.. ఆ పార్టీ బీజేపీకి బి టీమ్ అంటూ విమర్శలతో విరుచుకుపడ్డారు మమత. వామపక్షాల తర్వాత టీఎంసీ పక్షాన నిలబడిన మైనార్టీ ఓట్లకు గండిపడే ప్రమాదం ఉండటంతో మమత ముందుగానే అలెర్ట్ అయ్యారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ […]

బెంగాల్ లో ఎ టీమ్ లు.. బి టీమ్ లు
X

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ పోరు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతోంది. అధికార టీఎంసీ వ్యూహాలకు బీజేపీ ప్రతి వ్యూహాలను రచిస్తోంది. బీజేపీ ఎత్తుగడలను అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఎంఐఎం ప్రకటించగానే.. ఆ పార్టీ బీజేపీకి బి టీమ్ అంటూ విమర్శలతో విరుచుకుపడ్డారు మమత. వామపక్షాల తర్వాత టీఎంసీ పక్షాన నిలబడిన మైనార్టీ ఓట్లకు గండిపడే ప్రమాదం ఉండటంతో మమత ముందుగానే అలెర్ట్ అయ్యారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కదలికలపై నిఘా పెట్టారు. ఆయన ఎవరితో చర్చలు జరిపితే వారిని తమవైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంఐఎం రాకతో మమత ఇబ్బంది పడుతుంటే.. ఇప్పుడు శివసేన ఎంట్రీ బీజేపీకి తలనొప్పిగా మారింది. బెంగాల్ ఎన్నికల్లో తొలిసారిగా శివసేన పోటీ చేస్తుందని ప్రకటించారు ఎంపీ సంజయ్ రౌత్. ఈమేరకు పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారని, బెంగాల్ లో సత్తా చూపిస్తామని తేల్చి చెప్పారు. దీంతో సహజంగానే హిందూ ఓటు బ్యాంకుపై నమ్మకం పెట్టుకున్న బీజేపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎంఐఎం బీజేపీకి ‘బి’ టీమ్ అయితే.. టీఎంసీకి శివసేన కూడా ‘బి’ టీమ్ లాగే పనిచేస్తుందని అప్పుడే సెటైర్లు మొదలయ్యాయి.

2019 సార్వత్రిక ఎన్నికల నాటికి బెంగాల్ లో శివసేన బీజేపీకి మిత్రపక్షంగా ప్రచార పర్వంలో పాల్గొంది. ఇప్పుడు బీజేపీ, శివసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. బెంగాల్ లో తాము గెలవలేకపోయినా, బీజేపీని ఓడించాలనే పట్టుదలతో శివసేన ఉంది. అందుకే శివసేన అక్కడ కూడా డైరెక్ట్ ఫైట్ కి దిగుతానంటోంది. ఈ ఎన్నికలు శివసేనకు సీట్లు తెచ్చిపెడతాయనే నమ్మకం లేదు కానీ, బీజేపీ ఓట్లపై మాత్రం ప్రభావం చూపిస్తాయని విశ్లేషకుల అంచనా.

లోక్ సభ రిజల్ట్ కలిసొచ్చేనా..?
294 సీట్ల పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం కేవలం 3 సీట్లు మాత్రమే. కానీ 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 18 ఎంపీ సీట్లు గెల్చుకుని 122 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది బీజేపీ. అదే ఉత్సాహంతో 2021 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసింది. ఎంఐఎం ఎంట్రీతో మైనార్టీ ఓట్లు చీలిపోతే మమత మరింత బలహీనపడుతుందని ఆశించింది. అయితే శివసేన రూపంలో తమకే ముప్పు ముంచుకొస్తుందని మాత్రం అంచనా వేయలేకపోయింది.

ఇక టీఎంసీ, బీజేపీ మధ్య.. కాంగ్రెస్ కూటమి కూడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ దఫా వామపక్షాలతో కలసి కాంగ్రెస్ బరిలో దిగుతోంది. ఎవరి అంచనాలు వారికి ఉన్నా.. ‘ఎ’ టీమ్ లు.. ‘బి’ టీమ్ లతో బెంగాల్ పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

First Published:  17 Jan 2021 9:58 PM GMT
Next Story