వ్యాక్సిన్ అంటే భయమెందుకు..?

కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోడానికి ఆరోగ్య సిబ్బంది భయపడుతున్నారా..? ఏపీతో సహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందా? గణాంకాలు చూస్తుంటే అవుననే అనుమానం వస్తోంది. ఒక్క విశాఖ పరిధిలోనే మొత్తం 3406మంది సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోడానికి గైర్హాజరయ్యారు. ఊరిలో లేమని కొంతమంది, ఆరోగ్యం బాగోలేదని మరికొందరు.. ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఒకరిద్దరంటే పర్వాలేదు.. వేలమంది దాదాపుగా ఒకేరకమైన కారణాలు చెప్పి వ్కాక్సినేషన్ కు రావడంలేదంటే వారిలో ఉన్న భయాందోళనలు అర్థం చేసుకోవచ్చు.

టీకాపై తగ్గిన ఆసక్తి..
కరోనా వచ్చిన కొత్తల్లో అందరి ఆలోచన టీకాపైనే ఉంది. ఏయే దేశాల్లో టీకా తయారు చేస్తున్నారు, ఏయే కంపెనీలు పని మొదలు పెట్టాయి, ఎవరి టీకా ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? ఎంత రేటుంటుంది..? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఆసక్తిగా సమాధానాలు వెదికారు జనాలు. అయితే తీరా టీకా వచ్చే సరికి అందరిలో ఆ ఆసక్తి అటకెక్కేసింది. కరోనా కేసులు, మరణాలు రోజు రోజుకి తగ్గిపోతుండటం, సాధారణ జనజీవనం తిరిగి ప్రారంభం కావడంతో జనాల్లో ఆ వ్యాధి పట్ల భయం పోయింది. దీంతో సహజంగానే అందరూ టీకా విషయాన్ని లైట్ తీసుకున్నారు. ఇక ప్రయోగ దశలు పూర్తి కాకుండానే టీకాకు భారత్ అనుమతి ఇవ్వడం మరో కారణం, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోనన్న అనుమానం కూడా వైద్య సిబ్బందిలో ఉంది. అందుకే చాలామంది వ్యాక్సినేషన్ కు వెనకడుగేస్తున్నారు. ఏపీలో తొలి మూడు రోజుల్లో 47,020మంది టీకా తీసుకున్నారు. వాస్తవంగా మూడు రోజుల్లో లక్షమంది వైద్య సిబ్బందికి టీకా వేయాలనేది ప్రభుత్వ టార్గెట్. కానీ ఏపీలో 43.4శాతం మంది వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ కి హాజరు కాకుండా ఇంటిపట్టునే ఉండిపోయారు. ఎవరికి వారే టీకా తీసుకోడానికి వెనకగుడేస్తుండే సరికి వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. తొలిరోజు ప్రపంచ రికార్డు బద్దలకొట్టామంటూ కేంద్రం గొప్పలు చెప్పుకున్నా.. అసలు భారత్ లో సగానికి సగం మంది టీకా పట్ల విముఖత చూపుతున్నారనేది వాస్తవం. గతంలో పలు సర్వేలు కూడా భారతీయులు టీకా పట్ల సుముఖంగా లేరనే అభిప్రాయాన్ని వెలుబిచ్చాయి. ఇప్పుడు అదే నిజమని తేలుతోంది.

టీకా తీసుకున్న ఇద్దరు మృతి..
మరోవైపు కొవిట్ టీకా తీసుకున్న తర్వాత ఉత్తర ప్రదేశ్ లో ఒకరు, కర్నాటకలో ఒకరు మృతి చెందడంతో కలకలం రేగింది. యూపీలోని మొరాదాబాద్ ఆస్పత్రి వార్డుబాయ్ కి టీకా ఇచ్చిన తర్వాత అదే రోజు రాత్రి అతను చనిపోయాడు. అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వల్ల అతను చనిపోయాడని, టీకా కారణం కాదని వైద్య అధికారులు చెబుతున్నా.. గతంలో అతనికి ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు లేవని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక కర్నాటకలో ఆరోగ్య శాఖ సిబ్బంది ఒకరు టీకా తీసుకున్న రోజే చనిపోయారు. అతనికి బీపీ, షుగర్ వంటి సమస్యలున్నాయి. ఇక్కడ కూడా ఆరోగ్యంగా అప్పటి వరకూ ఉన్న వారు, అకస్మాత్తుగా చనిపోవడం కలచివేసే విషయం.

ఏపీతోపాటు.. ఇతర రాష్ట్రాల్లో కూడా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోడానికి వైద్య సిబ్బంది వెనకడుగేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వైద్య సిబ్బందే ధైర్యం చేయని పరిస్థితుల్లో, ఇక సామాన్యుల సంగతి ఎలా ఉంటుందో ఈహించొచ్చు.