తిరుపతి కేంద్రంగా రాజకీయ తీర్థ యాత్రలు..

మత రాజకీయాలతో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నాయి బీజేపీ, టీడీపీ. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ తీర్థ యాత్రలు మొదలు పెట్టాయి. కపిల తీర్థం టు రామ తీర్థం అంటూ బీజేపీ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించడంతో.. అంతకంటే ముందే ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో టీడీపీ నేతలు రోడ్డెక్కాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రకటించారు చంద్రబాబు. ఈ నెల 21 నుంచి తిరుపతి లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో 10 రోజులపాటు 700 గ్రామాల్లో ధర్మ పరిరక్షణ యాత్ర జరుగుతుందని అన్నారాయన. టీడీపీ యాత్ర అయిపోగానే ఫిబ్రవరి 4నుంచి బీజేపీ యాత్ర మొదలవుతుంది. మొత్తంగా.. తిరుపతి కేంద్రంగా రెండు పార్టీలు యాత్రల పేరుతో హడావిడి మొదలు పెట్టేశాయి.

మత రాజకీయాలకు లిట్మస్ టెస్ట్..
కొన్ని రోజులుగా ఆలయాల సంఘటనలతో ఏపీలో మత రాజకీయాలు మొదలయ్యాయి. పోలీసు విచారణలో ఆలయాల ఘటనలపై ప్రతిపక్షాల బయటపడటంతో రాజకీయ కోణం తేటతెల్లమైంది. అయితే ఈ తరహా రాజకీయాలతో ఏపీలో ఓటర్లను ఆకర్షించడం సాధ్యమా కాదా అనేది అనుమానం. కేవలం హిందూ మతంవైపు మిగిలిపోవడం అంటే.. మైనార్టీలు, ఇతర వర్గాల ఓట్లను కాలదన్నుకోవడమే. మరోవైపు హిందువులంతా ఏకపక్షంగా ఓట్లు వేస్తారనే నమ్మకం కూడా లేదు. ఈ దశలో తిరుపతి ఉప ఎన్నికలను మత రాజకీయాలకు లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్నాయి టీడీపీ, బీజేపీ. తిరుపతిలో తమ ప్లాన్ వర్కవుట్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా రాజకీయాలకు ప్రయత్నిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

రెండో స్థానం కోసం పోటాపోటీ..
తిరుపతి ఉప ఎన్నికల్లో ఇటు టీడీపీకి కానీ, అటు జనసేన-బీజేపీకి కానీ విజయంపై ధీమా లేదు. పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నా.. లోపల రెండో స్థానం దక్కితే చాలని అనుకుంటున్నాయి. తిరుపతిలో రెండోస్థానం నిలబెట్టుకుంటే.. ప్రతిపక్షంగా తమ రేంజ్ పడిపోలేదని టీడీపీ ధైర్యంగా ఉంటుంది. అదే స్థానం బీజేపీ-జనసేనకు దక్కితే.. ఏపీలో ప్రతిపక్ష స్థానం మాదేనంటూ ఆ రెండు పార్టీలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు తిరుపతిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. రాజకీయ తీర్థ యాత్రలతో ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నాయి. వైసీపీని ఓడించలేకపోయినా, కనీసం మెజార్టీ తగ్గించినా చాలని భావిస్తున్నాయి.