డ్రాగన్ ఫ్రూట్ కాదు.. కమలం

బీజేపీ సీఎంలు అంటే పేర్లు మార్చడం హాబీగా పెట్టుకున్నట్లే ఉన్నది. మొన్నటి వరకు యూపీ సీఎం ఊర్లపేర్లు మారుస్తూ వార్తల్లోకి ఎక్కారు. తాజాగా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన ‘డ్రాగన్ ఫ్రూట్’ పేరును మార్చేశారు. డ్రాగన్ ఫ్రూట్‌ను చూస్తే అచ్చం తామర పువ్వు ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఇకపై డ్రాగన్ ఫ్రూట్‌ను ‘కమలం’ అని పిలవబోతున్నట్లు ఆయన చెప్పారు. తామరపువ్వును సంస్కృతంలో ‘కమలం’ అంటారు కాబట్టే దాని పేరును అలా పెట్టామని ఆయన మంగళవారం చెప్పారు.

‘డ్రాగన్ ఫ్రూట్ అనే పేరు ఆ ఫలానికి అస్సలు నప్పలేదు. దానికి సరైన పేరు కమలం మాత్రమే. ఇప్పటికే ఈ ఫలం పేరును మార్చాలని దరఖాస్తు చేశాము. ఆ పండును కమలం అని పిలిచేలా త్వరలో పేటెంట్ కూడా రాబోతున్నది. అయితే మేము అప్పటి వరకు ఆగదల్చుకోలేదు. నేటి నుంచి ఆ పండును ‘కమలం’ అని పిలవాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది’ అని రూపానీ వెల్లడించారు. కాగా, ఈ పేరు మార్పు వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని.. ఆ పండు యొక్క రూపాన్ని చూసి మాత్రమే అలా పేరు మార్చామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. ప్రభుత్వం అసలైన పనిని వదిలిపెట్టి అనవరసమైన వాటిపై దృష్టిపెట్టిందని విమర్శించారు. కాగా, గతంలోనే గుజరాత్ అటవీ శాఖ ఈ ఫలం పేరు మార్చాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు దరఖాస్తు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కచ్‌కు చెందిన కొంత మంది రైతులు కూడా డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మార్చాలని గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ పండును పితహాయ, స్ట్రాబెరీ పియర్ అనే వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు.