సాగు చట్టాలపై కేంద్రం వెనకడుగు..

పీటముడి విడిపోతోంది, సాగు చట్టాల రద్దు దిశగా ఓ అడుగు ముందుకు పడింది. పదో విడత చర్చల తర్వాత రైతులలో ఓ ఆశ చిగురించింది. అంతమాత్రాన ప్రధాని మోదీని పూర్తిగా నమ్మలేం కానీ.. రైతుల ఉద్యమంతో ఆయన ఓ మెట్టు దిగారనే విషయం మాత్రం స్పష్టమైంది. సాగు చట్టాల అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించిన తర్వాత ఆలోచనలో పడిన కేంద్రం పదో విడత చర్చల్లో రైతులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కీలక ప్రతిపాదనలు వారి ముందు ఉంచింది. ఏడాదినుంచి ఏడాదిన్నర వరకు వ్యవసాయ చట్టాల అమలు నిలిపేస్తామని స్పష్టం చేసింది.

ఉమ్మడి కమిటీ..
రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో ఉమ్మడిగా కమిటీ వేసి వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరాలపై అధ్యయనం చేస్తామని పదో విడత చర్చల సందర్భంగా కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోంప్రకాశ్ ప్రతిపాదించారు. ఈ కమిటీ నివేదిక వచ్చేవరకు సాగు చట్టాల అమలును ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు వాయిదా వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీనిపై చర్చించుకొని నిర్ణయం చెప్పాలని రైతు సంఘాలను కోరారు.

నోటి మాట నమ్మలేం..
కేంద్ర మంత్రులు ఇచ్చిన మాటను తాము నమ్మాలంటే చట్టాల అమలు నిలిపివేత ప్రతిపాదనపై కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్రం ప్రతిపాదనపై తాము చర్చించుకొని నిర్ణయం చెబుతామన్నారు. ఈనెల 22న మరోసారి సమావేశమై చర్చలు జరపాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. చర్చల సందర్భంగా చట్టాల అమలు నిలిపివేత హామీని రైతులు నమ్మకపోవడంతో కేంద్రం తరపున అఫిడవిట్ ఇస్తామని మంత్రులు స్పష్టం చేశారు. దీంతో రైతు సంఘాల నేతలు కాస్త మెత్తబడ్డారు.

అదే ఆఖరి సమావేశం అవుతుందా..?
ఈనెల 22న జరిగే సమావేశమే ఆఖరిది అవుతుందని, ఇరు వర్గాలు ఓ ఒప్పందానికి వచ్చి ఆందోళనలు ఆగిపోతాయని అంచనా వేస్తున్నారు. సాగు చట్టాల రద్దు విషయంలో పట్టుబడుతున్న రైతు సంఘాలు.. ఏడాదిన్న వరకు వాటి అమలు నిలిపేస్తామంటూ కేంద్రం ఇచ్చిన హామీని ఒప్పుకోక తప్పేలా లేదు. మరోవైపు సుప్రీంకోర్టు వేసిన కమిటీని కూడా కాదన్న రైతు సంఘాల నేతలు.. తమకూ భాగస్వామ్యం ఉందని చెబుతున్న ప్రభుత్వ కమిటీని వ్యతిరేకిస్తారని అనుకోలేం. అటు కేంద్రం కూడా రైతుల ఆందోళనలపై మెత్తబడినట్టు తెలుస్తోంది. వ్యవసాయ చట్టాల విషయంలో మొండిగా ఉంటే.. ప్రతిపక్షాలు రైతు ఉద్యమాన్ని హైజాక్ చేస్తాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని బీజేపీ అంచనా వేసింది. మరోవైపు రిపబ్లిక్ డే సందర్భంగా చేపట్టి ట్రాక్టర్ల ర్యాలీతో కూడా కేంద్రం పూర్తి స్థాయిలో ఇరుకున పడే అకాశం ఉంది. ఆలోగా అన్నీ సర్దుబాటు చేసి, రైతుల్ని ఢిల్లీ సరిహద్దులనుంచి ఖాళీ చేయించాలని చూస్తోంది. అందుకే ఏడాదిపాటు చట్టాల అమలు నిలిపేస్తున్నామనే ఆఫర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆఫర్ నే తిరస్కరించిన రైతులు.. కేంద్రం ప్రతిపాదనని ఒప్పుకుంటారా, లేక చట్టాలు రద్దయ్యే వరకు ఉద్యమిస్తారా..? మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.