అధ్యక్ష పదవిపై రాహుల్​ నిరాసక్తత? ఆ సీటుపై ఎవరు కూర్చోబోతున్నారు?

ఏఐసీసీ అధ్యక్షుడు ఎవరు? కాంగ్రెస్​ కార్యకర్తలను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. రాహుల్​గాంధీ ఆ పదవి చేపట్టాలని కాంగ్రెస్​ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి. ఆ పార్టీ నేతలు కూడా ఇదే ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే గాంధీయేతర కుటుంబసభ్యులు ఎవరైనా ఆ పదవిని చేపడితే అంతర్గత విభేదాలు రావడం ఖాయం. అయితే ఈ పదవి చేపట్టేందుకు ఎందుకో రాహుల్​గాంధీ పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్​గాంధీలో నైరాశ్యం ఆవరించినట్టు సమాచారం. ఆ తర్వాత కొంతకాలం ఆయన యాక్టివ్​గా కనిపించినప్పటికీ ప్రస్తుతం అధ్యక్ష పీఠం అధిరోహించడానికి మాత్రం ఆయన సిద్ధంగా లేరు. అయితే రాహుల్​ స్థానంలో ఎవరిని నియమిస్తే బాగుంటుందని కాంగ్రెస్​ యోచిస్తున్నది.

ఇందుకోసం రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లాత్​ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. అశోక్​ గెహ్లాత్​ కాంగ్రెస్​ అధిష్టానానికి ఎంతో సన్నిహితుడు. వీర విధేయుడు కూడా. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఆయన కాంగ్రెస్​నే నమ్ముకొని ఉన్నారు. అయితే ప్రస్తుతం రాజస్థాన్​ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్​ గెహ్లాత్​ ఆ పదవిని వదిలిపెట్టి వస్తారా? అన్నది ప్రశ్నార్థకమే.

ఏఐసీసీ అధ్యక్ష పదవి కాంగ్రెస్​లో అత్యున్నతమైన పదవే అందులో ఏ సందేహాం లేదు. కానీ గాంధీయేతర కుటుంబసభ్యులు ఆ పదవిలో కూర్చొంటే వారికి పూర్తిస్థాయి అధికారాలు ఉండవన్న విమర్శలు ఉన్నాయి. స్వతంత్రంగా ముందుకెళ్లినా.. గాంధీ కుటుంబాన్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నా ఆ పదవి ఉండదు. అనేక లిమిటేషన్ష్ మధ్య వాళ్లు ఆ పదవి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అశోక్​ గెహ్లాత్​ను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న వార్త ప్రస్తుతం ఢిల్లీలో వినిపిస్తున్నది. ఆయన ఆ పదవి చేపడతారో లేదో వేచిచూడాలి.