Telugu Global
NEWS

తిరుపతి మీకిస్తాం.. సీఎం సీటు మాకివ్వండి..

అనుకున్నంతా అయింది.. తిరుపతిలో పవన్ కల్యాణ్ మీటింగ్ తో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటి వరకూ శాంతంగా కనిపించిన బీజేపీ, జనసేన.. తిరుపతి విషయంలో మంకుపట్టు పట్టినట్టే కనిపిస్తున్నాయి. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అంటూ తిరుపతిలో సమావేశం పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఉప ఎన్నికల విషయంలో బీజేపీకి డెడ్ లైన్ కూడా పెట్టేశారు. వారం లోగా అభ్యర్థిపై స్పష్టత వస్తుందని ఏకపక్షంగా చెప్పేశారు. అంటే ఆలోగా బీజేపీ తేల్చితే సరి, లేకపోతే తాము చేయాల్సింది […]

తిరుపతి మీకిస్తాం.. సీఎం సీటు మాకివ్వండి..
X

అనుకున్నంతా అయింది.. తిరుపతిలో పవన్ కల్యాణ్ మీటింగ్ తో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటి వరకూ శాంతంగా కనిపించిన బీజేపీ, జనసేన.. తిరుపతి విషయంలో మంకుపట్టు పట్టినట్టే కనిపిస్తున్నాయి. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అంటూ తిరుపతిలో సమావేశం పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఉప ఎన్నికల విషయంలో బీజేపీకి డెడ్ లైన్ కూడా పెట్టేశారు. వారం లోగా అభ్యర్థిపై స్పష్టత వస్తుందని ఏకపక్షంగా చెప్పేశారు. అంటే ఆలోగా బీజేపీ తేల్చితే సరి, లేకపోతే తాము చేయాల్సింది చేసేస్తామనే హింట్ ఇచ్చారు.

పవన్ దే భారమంతా..
సాధారణంగా ఇలాంటి మీటింగుల్లో చర్చకు వచ్చే విషయాలను, జనసేన నాయకత్వం బయటకు రానివ్వదు. ఆ తర్వాత ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి తాము చెప్పాలనుకున్న వాటినే గుదిగుచ్చి మీడియాకిచ్చేస్తుంది. కానీ తాజా మీటింగ్ వివరాలన్నిటినీ ఈ దఫా మీడియాకు లీక్ చేశారు. తిరుపతిలో జనసేనకు బలం ఉందని పీఏసీ మీటింగ్ లో సభ్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని, కచ్చితంగా తమ పార్టీయే పోటీ చేయాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారని చెప్పారు. ఒకవేళ బీజేపీ అభ్యర్థి బరిలో దిగితే జీహెచ్ఎంసీ తరహాలో గట్టి పోటీ ఇవ్వాలని, కేంద్ర అధినాయకత్వం కూడా వచ్చి ప్రచారం చేయాలని సూచించారు. అదే జనసేన అభ్యర్థి బరిలో దిగితే.. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం చేస్తారని కూడా తేల్చేశారు. ఎవరు పోటీ చేసినా, ఉమ్మడిగా వైరి పక్షాలను ఎదుర్కుంటాం అని అంటూనే.. ఆ సీటు మాకే ఇవ్వండి అనే డిమాండ్ మాత్రం కాస్త గట్టిగానే వినిపించారు జనసేన నేతలు.

లాజిక్ అదిరింది..
పీఏసీ మీటింగ్ లో కొంతమంది భలే లాజిక్ తీశారు. జనసేన బలంగా ఉన్న తిరుపతి సీటుని ఒకవేళ బీజేపీ బలవంతంగా తీసుకుంటే.. అదే సమయంలో పవన్ కల్యాణ్ ని రెండు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని మెలిక పెడతారట. అలా ప్రకటిస్తేనే తిరుపతి సీటు వదులుకుంటామని కొంతమంది నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు జనసేన ప్రెస్ నోట్ లో స్పష్టం చేశారు. ఒకవేళ ఇలాంటి అర్థంలేని డిమాండ్లను పవన్ తోసి పుచ్చితే వాటికి ప్రెస్ నోట్ వరకూ ఎక్కే ప్రాధాన్యత దక్కదు. పవన్ అనుమతితోనే అలాంటి అంశాల్ని కూడా మీడియాకు విడుదల చేశారు. అంటే.. సీఎం సీఎం అంటూ కార్యకర్తలు చేస్తున్న నినాదాల్ని పవన్ బాగా తలకెక్కించుకున్నారనే విషయం అర్థమవుతోంది. ఇక బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కూడా పవన్ పరోక్ష విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో క్షేత్ర స్థాయి సమస్యలు ఉన్నట్లు పీఏసీలో చెప్పారని, గతంలో ఇలాంటి ఇబ్బందులు ఉంటే బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడానని అన్నారు.

ఏదేమైనా తిరుపతి సీటుపై బీజేపీ, జనసేన మధ్య పీటముడి పడిందనే విషయం అర్థమవుతోంది. అటు యాత్రల పేరుతో బీజేపీ పొలిటికల్ మైలేజీకోసం ప్రయత్నిస్తున్న టైమ్ లో.. ఇటు పవన్ కల్యాణ్ తిరుపతిలోనే మీటింగ్ పెట్టుకుని సీఎం అభ్యర్థి అంటూ హడావిడి చేశారంటే.. ఎక్కడో ఏదో తేడా వచ్చిందనే విషయం అర్థమవుతోంది.

First Published:  21 Jan 2021 9:27 PM GMT
Next Story