Telugu Global
National

బెస్ట్ ఆఫర్ అంటున్న కేంద్రం.. ససేమిరా అంటున్న రైతులు

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య రోజు రోజుకూ దూరం పెరుగుతోంది. కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు దాదాపు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్నాయి. అటు కేంద్రం, ఇటు రైతు సంఘాలు పట్టువీడడానికి సిద్ధంగా లేకపోవడంతో సమస్య పరిష్కారానికి మార్గం కనిపించడం లేదు. రైతు సంఘాలతో కేంద్రం జరిపిన 11వ దఫా చర్చలు సైతం నిరాశాజనకంగా ముగిశాయి. వ్యవసాయ చట్టాల అమలును […]

బెస్ట్ ఆఫర్ అంటున్న కేంద్రం.. ససేమిరా అంటున్న రైతులు
X

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య రోజు రోజుకూ దూరం పెరుగుతోంది. కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు దాదాపు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్నాయి. అటు కేంద్రం, ఇటు రైతు సంఘాలు పట్టువీడడానికి సిద్ధంగా లేకపోవడంతో సమస్య పరిష్కారానికి మార్గం కనిపించడం లేదు. రైతు సంఘాలతో కేంద్రం జరిపిన 11వ దఫా చర్చలు సైతం నిరాశాజనకంగా ముగిశాయి.

వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామంటూ కేంద్రం చేసిన ప్రతిపాధనను రైతు సంఘాలు తిరస్కరించాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అంటూ పట్టుబట్టాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. రైతు సంఘాల డిమాండ్లను ఆమోదించడానికి కేంద్రం సిద్ధంగా లేకపోవడంతో చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి.

కాగా.. రైతు సంఘాల తీరుపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘాలు రైతుల సంక్షేమాన్ని కాంక్షించడం లేదని, అందుకే చర్చలు కొలిక్కిరాకుండా ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలపై ప్రత్యామ్నాయాల గురించి మేము ఆలోచిస్తుంటే, రైతు సంఘాలు మాత్రం చట్టాల రద్దుకు పట్టుబడుతున్నాయని అన్నారు. రైతుల సంక్షేమం దృష్ట్యా కేంద్రం ప్రతిపాధనల పట్ల సానుకూలంగా స్పందించాలని రైతు సంఘాలను మంత్రి కోరారు. ఇంతకంటే ఉత్త‌మ‌మైన‌ మార్గం లేదన్నారు.

ఇప్పటికే వ్యవసాయ చట్టాల చుట్టూ నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు ప్రత్యేక కమిటీని నియమించింది. కాగా.. కమిటీ ముందుకు రావడానికి రైతు సంఘాలు ససేమిరా అంటున్నాయి. మరోవైపు.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ట్రాక్టర్ మార్చ్ నిర్వహించడానికి రైతు సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యను తాత్కాలికంగానైనా కప్పిపెట్టాలనుకుంటోంది కేంద్రం. కానీ కేంద్రం ప్రతిపాధనలు వినడానికి రైతుల సంఘాలు సిద్ధంగా లేవు. దీంతో.. కేంద్రం, రైతు సంఘాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.

11వ దఫా చర్చలు అసంపూర్ణంగా ముగియడంతో ఇప్పట్లో ఈ సమస్య పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. మరోసారి రైతుల సంఘాలతో చర్చించేందుకు కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని, ఇక చర్చలు కొనసాగుతాయని తాము భావించడంలేదని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. అఖిల భారత రైతు సమన్వయ సమితి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు. 26వ తేదీన ట్రాక్టర్ మార్చ్ ను శాంతియుతంగా నిర్వహస్తామన్నారు. ఇప్పటికే లక్షలాది మంది రైతులు వేరు వేరు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి తరలివస్తున్నారు.

రైతు నేతల హత్యకు కుట్ర
కేంద్రం, రైతుల మధ్య చర్చలు అసంపూర్ణంగా ముగిసిన వేళ ఆందోళన కలిగించే విషయం బయటపడింది. జనవరి 2న రైతులు తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కొందరు వ్యక్తులు రైతు నేతల హత్యకు కుట్రపన్నారు. ట్రాక్టర్ మార్చ్ ను భగ్నం చేసేందుకు నలుగురు రైతు సంఘాల నేతలను హత్య చేయాలనుకున్న ఓ వ్యక్తిని రైతులు పట్టుకొని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. రైతు సంఘాల నేతలను హత్య చేసేందుకు ముందే రెక్కీ నిర్వహించినట్లు ఆ వ్యక్తి మీడియా ముందు అంగీకరించాడు. అనంతరం అతడిని రైతులు పోలీసులకు అప్పగించారు. తాజా పరిణామాలతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.

First Published:  22 Jan 2021 10:08 PM GMT
Next Story