Telugu Global
NEWS

కేటీఆర్ సీఎం అయితే కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

తెలంగాణ సీఎం పదవిని తన కుమారుడు, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరి కేటీఆర్ సీఎం అయితే కేసీఆర్ ఏం చేస్తారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడిగా గత రెండు దశాబ్దాలుగా కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. గత ఏడేళ్లుగా ప్రభుత్వాన్ని నడిపించారు. దాదాపు 20 ఏళ్లు విశ్రాంతి లేకుండానే బిజీ బిజీగా గడిపారు. […]

కేటీఆర్ సీఎం అయితే కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
X

తెలంగాణ సీఎం పదవిని తన కుమారుడు, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరి కేటీఆర్ సీఎం అయితే కేసీఆర్ ఏం చేస్తారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడిగా గత రెండు దశాబ్దాలుగా కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. గత ఏడేళ్లుగా ప్రభుత్వాన్ని నడిపించారు. దాదాపు 20 ఏళ్లు విశ్రాంతి లేకుండానే బిజీ బిజీగా గడిపారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని కొడుకు చేతిలో పెట్టబోతున్నారు.

అదే సమయంలో తాను స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్ష పదవిని మాత్రం వదులుకోబోవడం లేదు. ఇకపై పార్టీ పూర్తి స్థాయి బాధ్యతలను సీఎం కేసీఆర్ చూడబోతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కాలంలో బీజేపీ బాగా బలపడుతుండటంతో పాటు గ్రామ స్థాయిలోకి కూడా చొచ్చుకొని పోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగతంగా బలమైన క్యాడర్ ఉన్నది. కానీ పార్టీకి దిశానిర్దేశం చేయడానికి ఆయా జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలు లేవు. జిల్లాలకు పార్టీ అధ్యక్షులు లేరు. దీంతో గ్రామస్థాయిలో ఏ కార్యక్రమం చేయాలన్నా వ్యక్తిగతంగా చేయాల్సి వస్తున్నదే తప్ప సరైన దిశా నిర్దేశం లేదు.

రానున్న రోజుల్లో పార్టీకి పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని.. అలాగే గ్రామాల్లో ఇతర పార్టీలను ఎదుర్కునేందుకు ధీటుగా వ్యూహాలను సిద్దం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు. కొడుకుకు ప్రభుత్వ బాధ్యతలు అప్పగించాక.. పార్టీని ముందుకు నడిపించేందుకు కేసీఆర్ సంసిద్దమవుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీని నడిపించడానికి కేసీఆర్ ఒక ప్రత్యేక బృందాన్ని కూడా తయారు చేసే పనిలో పడ్డారు. యువకులు, క్షేత్రస్థాయిలోకి వెళ్లి పని చేయగలిగే నాయకులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేటీఆర్ సీఎం అయిన తర్వాత కొన్ని రోజులు ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకొని.. తిరిగి పార్టీ బాధ్యతలను భుజాలకు ఎత్తుకోవడానికి కేసీఆర్ రంగం సిద్దం చేసుకుంటున్నారని తెలుస్తున్నది.

First Published:  22 Jan 2021 11:57 PM GMT
Next Story