ఏపీలో ఇంటింటికీ ఇంటర్నెట్

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాలలో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో నెట్‌వర్క్ పాయింట్స్, ఇంటర్నెట్ లైబ్రరీలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో.. అమ్మ ఒడి పథకం కింద ల్యాప్‌టాప్‌లను అందించడంపై, గ్రామీణ ప్రాంతాలకు కావలసిన కనెక్షన్ ప్రణాళికలపై మాట్లాడారు. గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నాన్-డిస్ట్రక్టివ్ కేబుల్స్ తో ఇంటర్నెట్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. గ్రామ నెట్‌వర్క్ పాయింట్ల నుంచి వైయస్ఆర్ జగన్నన్న కాలనీలలో కూడా వారు ఇంటింటికీ ఇంటర్‌నెట్ పొందేలా చూడాలని ఆయన అన్నారు.

హెచ్‌టి లైన్ నుంచి సబ్‌స్టేషన్‌కు, సబ్‌స్టేషన్ నుంచి గ్రామ పంచాయతీలకు భూగర్భ కేబుల్ వేయాలనే ఆలోచన ఉందని జగన్ చెప్పారు. పంచాయితీ స్థాయిలో సరైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులకు సరైన సేవలు అందిచగలమని అన్నారు.

అమ్మ ఒడి, వసతి దీవెన పథకం లబ్ధిదారులకు ల్యాప్‌టాప్‌ల సదుపాయాల గురించి కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. తొమ్మిదో తరగతి నుంచి 12 వరకు చదువుతున్న వారు వచ్చే ఏడాది నుంచి ఆర్థిక సహాయానికి బదులు ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ లేదా ఇతర సాంకేతిక కోర్సులు అభ్యసించే విద్యార్థుల అవసరాలను తీర్చేలా మరిన్ని స్పెసిఫికేషన్లతో ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం గురించి ఆలోచించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ల్యాప్‌టాప్ దెబ్బతిన్నట్లయితే దానిని వార్డు, గ్రామ కార్యదర్శులకు అప్పగించాలని ఆయన అన్నారు. వాటిని ఒక వారంలో మరమ్మతులు చేయడం లేదా భర్తీ చేయడం జరగాలి. అన్నారు. ఈ సమావేశంలో పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.