మూఢ భక్తితో పిల్లలను హతమార్చిన తల్లిదండ్రులు

తండ్రి ప్రభుత్వ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్.. తల్లి ఒక పాఠశాలకు కరస్పాండెంట్.. ఇద్దరు పిల్లలు కూడా బాగా చదువుకున్న వాళ్లు. అలాంటి కుటుంబం ఎలా జీవించాలి? వారి ఆలోచనా విధానాలు ఎలా ఉండాలి? చదువు లేని వాళ్లు కూడా చేయని అత్యంత ఘోరానికి పాల్పడ్డారు ఆ తల్లిదండ్రులు. ఎంతో మందికి విద్యాబుద్దులు నేర్పుతున్న ఆ తల్లిదండ్రులు సొంత కూతుళ్లను భక్తి పేరుతో హతమార్చారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంకిశెట్టిపాలెంలో జరిగింది. పోలీసుల చెప్పిన వివరాల మేరకు..

అంకిశెట్టిపల్లి పంచాయతీ శివనగర్‌కు చెందిన ఎన్. పురుషోత్తమనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా కళాశాలలో వైస్ ప్రిన్సిపల్, అతని భార్య ఒక పాఠశాలలో కరస్పాండెట్‌గా పని చేస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె అలేఖ్య (27) భోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్న కుమార్తె సాయిదివ్య (22) రెహ్మన్ అకాడెమీలో సంగీతం నేర్చుకుంటున్నది. గత ఏడాది ఆగస్టులో వీళ్లు శివనగర్‌లో నిర్మించిన కొత్త ఇంటిలోకి మారారు. వచ్చిన దగ్గర నుంచి వీళ్లు ఎప్పుడూ పూజలు చేసేవాళ్లు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పూజ చేసిన అనంతరం చిన్న కూతురును శూలంతో పొడిచి చంపగా, పెద్ద కుమార్తెను నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి చంపారు.

తర్వాత ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పని చేసే కళాశాల అధ్యాపకునికి చెప్పగా ఆయన ఇంట్లో పరిస్థితి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులను విచారించగా బిడ్డలను కొట్టి చంపినట్లు తెలిపారు. ఇద్దరు యువతులను తల్లే కొట్టి చంపిందని.. అప్పుడు తండ్రి అక్కడే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. చనిపోయిన ఇద్దరు యువతులు, తల్లిదండ్రులు అందరూ పూర్తిగా దైవ భక్తిలో లీనమయ్యారని.. చనిపోయిన తర్వాత తిరిగి బతుకుతామనే ధీమా ఉండి అలా చేశారని చెప్పారు. ఈ ఘటన ప్రస్తుతం మదనపల్లెలోనే కాకుండా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తల్లిదండ్రులు పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారు.