చిన్నారుల రొమ్ములపై నొక్కడం నేరం కాదు : బాంబే హైకోర్టు సంచలన తీర్పు

నేరుగా శరీరాన్ని తాకకుండా చిన్నారుల రొమ్ముపై నొక్కడం, లైంగిక ఉద్దేశం కలిగి ఉండటం పోస్కో చట్టం కింద నేరంగా పరిగణించబడవని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. పోస్కో చట్టం కేవలం చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన ప్రత్యేక చట్టం మాత్రమే అంటూ నాగ్‌పూర్ బెంచ్ సింగిల్ జడ్జి జస్టీస్ పుష్ప వి గనేడీవాలా సంచలన తీర్పు ఇచ్చారు. మైనర్ బాలిక పై వస్త్రం తొలిగించకుండా ఆమె రొమ్ములను నొక్కితే లైంగిక వేధింపుల కిందకు రాదని జడ్జి పేర్కొన్నారు. అయితే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం దాన్ని మహిళ యొక్క గౌరవానికి భంగం కలిగించినట్లు అవుతుందని చెప్పారు.

12 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా ఆ చిన్నారి వేసుకున్న నిక్కర్‌ను తొలగించడానికి ప్రయత్నించినట్లు ఒక మహిళ కేసు నమోదు చేసింది. పోస్కో, ఐపీసీ చట్టాల ప్రకారం అతడిని శిక్షించాలని పేర్కొన్నది. దానికి సంబంధించిన తీర్పులో జడ్జి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పోస్కో చట్టం ప్రకారం లైంగిక వేధింపులు అంటే నిందితుడు బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నించాలి లేదా ఉద్దేశపూర్వకంగా ప్రైవేటు భాగాలను తాకి ఉండాలి. అప్పుడు మాత్రమే ఫోక్సో చట్టం ప్రకారం శిక్షించవచ్చు. కానీ ఈ కేసులో నిందితుతు బాలిక టాప్ పై నుంచి మాత్రమే తాకాడు.. అసలు లైంగిక దాడికి ప్రయత్నించినట్లు కూడా ఆధారాలు లేవు అలాంటప్పుడు ఇది ఫోక్సో చట్టం కింద నేరం అవుతుందని భావించలేమని సింగిల్ జడ్జి తన తీర్పులో చెప్పారు.

ఈ నేరాన్ని కేవలం ఐపీసీ 354, 342 ప్రకారం మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, అవమానించడం కింద మాత్రమే పరిగణిస్తామని చెప్పింది. ఫోక్సో చట్టాల కింద నమోదయ్యే కేసుల్లో కచ్చితమైన ఆధారాలు ఉండాలని తీర్పులో జడ్జి పేర్కొన్నారు. కాగా, ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది. కేవలం లైంగిక చర్యలకు పాల్పడితేనే అత్యాచారమా? రొమ్ములపై తాకితే లైంగిక దాడి కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.