పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరకే పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సహా ఉద్యోగులు, ఇతరులు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పులు సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం జస్టీస్ కిషన్ కౌల్, హృషికేష్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి పలు విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం పోలీసు భద్రత అవసరమని.. ఉద్యోగులందరూ కరోనా వ్యాక్సినేషన్‌లో ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం కష్టమవుతుందని వాదించారు.

గోవాలో కూడా కరోనా వ్యాక్సినేషన్ కోసం ఎన్నికలు వాయిదా వేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొని వచ్చారు. వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. అయితే దీనిపై ఎస్ఈసీ కేవియట్‌ను కూడా పరిశీలించి వాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలను కూడా పరిగణలోనికి తీసుకున్నారు. చివరకు ద్విసభ్య ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయడం కుదరదంటూ తీర్పు ఇచ్చింది. ఎన్నికల నిలిపివేతను కోరుతూ పెట్టిన పిటిషన్లు అన్నింటినీ కొట్టేసింది. దీంతో పంచాయతీ ఎన్నికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగడానికి మార్గం సుగమమం అయ్యింది.