ఢిల్లీలో ఉద్రిక్తం.. ట్రాక్టర్ ర్యాలీలో హింస.. పోలీసుల లాఠీచార్జ్

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా మంగళవారం భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. గణతంత్ర వేడుకల పరేడ్ ముగిసిన తర్వాత ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. అయితే రైతులు మాత్రం ముందుగానే ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభించారు. వారిని నిలువరించడానికి పోలీసులు బారికేడ్లు, బస్సులు, లారీలను అడ్డుగా పెట్టారు. దీంతో పలు చోట్లు బారికేడ్లను తొలగించి, బస్సులను ధ్వంసం చేసి ఆందోళనకారులు ముందుకు దూసుకొని వెళ్లారు. ఐవోటీ ప్రాంతంలో ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు బస్సును ఆందోళన కారులు ధ్వంసం చేశారు.

రైతుల చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పాటు పలు చోట్ల విధ్వంసానికి పాల్పడటంతో వారిని చెదరగొట్టటానికి పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. ఢిల్లీలో ఆందోళనలు పెరిగిపోవడంతో సమయ్ పూర్ బద్లీ, రోహిణి సెక్టార్ 18/19, హైదర్‌పూర్ బద్లీ మోర్, జహంగీర్ పురీ, ఆదర్శ్ నగర్, ఆజాద్ పూర్, మోడల్ టౌన్, జీటీబీ నగర్, విశ్వవిద్యాలయ, విధాన్ సభ, సివిల్ లైన్స్ మెట్రో స్టేషన్లను మూసేశారు.

మరోవైపు బస్సులపై దాడి చేస్తుండటంతో లాఠీచార్జ్‌తో పాటు టియర్ గ్యాస్, వాటర్ కేనన్‌లను ప్రయోగించారు. పోలీసులు ట్రాక్టర్ల ర్యాలీపై దాడి చేయడాన్ని రైతు సంఘ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ర్యాలీలో కొంత మంది ఉద్దేశపూర్వకంగా చొరబడ్డారని నాయకులు ఆరోపిస్తున్నారు.