పంచాయతీ పోరుతో ఇరుకున పడ్డ బీజేపీ, జనసేన..

తిరుపతి ఉప ఎన్నికల విషయంలో అధికార, ప్రతిపక్షాలకంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యాయి బీజేపీ, జనసేన. నోటిఫికేషన్ కంటే ముందే.. సీటుకోసం తెగ కుస్తీలు పడ్డాయి. సీటు మాకిస్తే సత్తా చూపిస్తాం అంటూ జనసైనికులు, లేదు మాకిస్తే గెలిచి చూపిస్తామంటూ బీజేపీ నేతలు ఎవరికి వారే రెచ్చిపోయారు. కట్ చేస్తే.. తిరుపతి ఉప ఎన్నికలకంటే ముందు పంచాయతీ ఎన్నికలు వచ్చేశాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలు ఏవైనా, ఎప్పుడొచ్చినా సై.. అంటూ ఉంటాయి. కానీ ఇక్కడ బీజేపీ, జనసేనకు మాత్రం పంచాయతీ నోటిఫికేషన్ తో నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అటు కపిలతీర్థం టు రామతీర్థం యాత్ర కూడా వాయిదా వేసుకుంటున్నట్టు వీర్రాజు ప్రకటన చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ తిరుపతి టార్గెట్ గా చేయాలనుకున్న యాత్రలు, సమావేశాలకు బ్రేక్ పడింది. పోనీ ఈ రెండు పార్టీలు స్థానిక పోరులో సత్తా చూపిస్తాయా అంటే అదీ లేదు. బీజేపీ, జనసేన బలపరిచిన అభ్యర్థి అంటూ కనీసం వార్డు మెంబర్ కూడా పోటీలో నిలబడే పరిస్థితి ఏపీలో లేదు. గెలిచే సత్తా లేదు కాబట్టి.. అధికార, ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడానికి సిద్ధమయ్యాయి బీజేపీ, జనసేన. ఏకగ్రీవాల విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మాటలపై గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ఏకగ్రీవాలపై పత్రికల్లో ప్రకటనలివ్వడం ఆశ్చర్యంగా ఉందని అన్నారాయన. అటు బీజేపీ కూడా ఎన్నికల హింసపై దృష్టిపెట్టాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. అభ్యర్థులను నామినేషన్ వేయకుండా బెదిరించే ధోరణిని అరికట్టాలని అన్నారు వీర్రాజు.

పోటీకి ‘సై’ అనరే..
తిరుపతి ఉప ఎన్నికల సీటు కోసం నానా హంగామా చేస్తున్న బీజేపీ, జనసేన.. పంచాయతీ ఎన్నికల్లో పోటీపై మాత్రం నోరు విప్పడంలేదు. కనీసం ఫలానా ప్రాంతంలో మా సత్తా చూపిస్తాం, ఫలానా ఏరియాలో మా బలం నిరూపించుకుంటాం, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లో జనసేన-బీజేపీ పవర్ ఏంటో చూపిస్తాం.. అని కూడా చెప్పలేకపోతున్నారు. లోక్ సభ సీటు కొట్టే సత్తా ఉన్నవారికి కనీసం వార్డు మెంబర్ సీటు గెలిచే ధైర్యం లేకపోవడం విడ్డూరం.

పార్టీల గుర్తు లేకుండా పంచాయతీ ఎన్నికలు జరగడం ఒక్కటే బీజేపీ, జనసేనకు ఊరటనిచ్చే అంశం. విజయాలను ఎవరికి వారే క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి.. జనసేన, బీజేపీ ఆ జోలికి వెళ్లవు. అయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో జరిగే పంచాయతీల్లో ఎవరికెంత బలం ఉంది అనే విషయంలో ఓ అంచనాకి రావొచ్చు. అలాంటప్పుడు కచ్చితంగా గ్రామాల్లో బీజేపీ, జనసేన బలపరచిన అభ్యర్థులను బరిలో దింపాల్సి ఉంటుంది. అధినాయకత్వం ఉత్సాహంగా ఉన్నా క్షేత్ర స్థాయిలో ఆ రెండు పార్టీల మద్దతుతో బరిలో దిగడానికి ఎవరు ముందుకొస్తారనేదే అసలు ప్రశ్న.