ఏపీలో పొలిటికల్ హీట్.. ఎన్నికలు.. ఏకగ్రీవాలు.. బదిలీలు..

సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఏపీలో ఇంత పొలిటికల్ హీట్ లేదు. పంచాయతీ ఎన్నికల విషయంలోనే ఎక్కడలేని గందరగోళం, ఆగ్రహావేశాలు, ఆరోపణలు.. అన్నీ చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు అసలు స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అనేదానిపైనే చర్చంతా జరిగింది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ తో ఎన్నికలు అనివార్యం అని తెలిశాక.. బదిలీల విషయంలో రాద్ధాంతం జరిగింది.

బది’లీలలు’
పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ పై బదిలీ వేటు వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ.. అంతటితో ఆగకుండా ఎన్నికల విధుల్లో వారు అలసత్వం వహించారంటూ అభిశంసించారు. ఆ విషయాన్ని సర్వీస్ రికార్డుల్లో చేర్చాలని కూడా ఆదేశాలిచ్చారు. దీనిపై రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు. నిజాయితీగా పనిచేసే ఉద్యోగులపై, కక్షసాధింపు తగదని, నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ముగిశాక.. ఈ బదిలీలను క్రమబద్ధీకరిస్తామంటూ హామీ ఇచ్చారు. అటు గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్ల బదిలీ కూడా జరిగిపోయింది. తిరుపతి అర్బన్ ఎస్పీపై పెండింగ్ లో ఉన్న బదిలీ వేటు ఇప్పుడు అమలులోకి వచ్చేసింది. వీరందర్నీ సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ సూచనల మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలిచ్చారు.

ఏకగ్రీవాల రచ్చ..
ఎన్నికలు, బదిలీల రచ్చ అయిపోతుందనుకుంటున్న టైమ్ లో ఏకగ్రీవాలతో మరోసారి రాజకీయ రణరంగం మొదలయ్యేలా కనిపిస్తోంది. పంచాయతీలన్నీ ఏకగ్రీవాలు చేసుకోవాలని, గ్రామాల్లో రాజకీయాలు వద్దని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు అదే సందర్భంలో.. ఏకగ్రీవాలుగా మారే పంచాయతీలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా.. ఇప్పుడు అధికారికంగా ప్రకటించేశారు. గతంలో కనిష్టంగా 15వేల రూపాయలు, గరిష్టంగా 50వేల రూపాయలు ఇస్తుండగా.. ఇప్పుడు జనాభాను బట్టి చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు ఏకంగా 20లక్షల రూపాయలు ప్రోత్సాహకాలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏకగ్రీవాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ప్రతిపక్షం మండిపడుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామంటోంది. బలవంతపు ఏకగ్రీవాలకు టీడీపీ నేతలు ఒప్పుకోవద్దని, ఇదంతా ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. మరోవైపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలపై దృష్టిపెట్టేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామంటూ ఎన్నికల కమిషనర్ ప్రకింటిచినట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏకగ్రీవాలయ్యే పంచాయతీలకు నగదు ప్రోత్సాహకం ఇచ్చే పద్ధతి 2001నుంచే ఉందని మంత్రులు గుర్తు చేస్తున్నారు. మొత్తమ్మీద ఏపీలో స్థానిక ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల రేంజ్ ని దాటిపోయేలా కనిపిస్తున్నాయి.