Telugu Global
NEWS

మనోహర్ వ్యాఖ్యలు అంత సీరియస్ గా తీసుకోవాలా..?

“చిరంజీవి రాజకీయాల్లోకి తిరిగొచ్చేస్తున్నారు. ఇదిగో సాక్ష్యం, నాదెండ్ల మనోహర్ చెప్పారంటే ఏదో జరిగే ఉంటుంది. కచ్చితంగా పవన్ కోసం చిరు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారు. జనసేనను బలోపేతం చేస్తారు.” తెలుగు మీడియాలో జరుగుతున్న హడావిడి అంతా ఇంతా కాదు. స్థానిక ఎన్నికల వేళ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే మనోహర్ అలాంటి మాటలు మాట్లాడారని కొంతమంది అంటుంటే.. కాదుకాదు నిజంగానే చిరంజీవి రీఎంట్రీకి మనోహర్ మాటలే నిదర్శనం అని మరికొందరు వివరణ ఇస్తున్నారు. ఇంతకీ మనోహర్ ఏమన్నారు.. “పవన్ […]

మనోహర్ వ్యాఖ్యలు అంత సీరియస్ గా తీసుకోవాలా..?
X

“చిరంజీవి రాజకీయాల్లోకి తిరిగొచ్చేస్తున్నారు. ఇదిగో సాక్ష్యం, నాదెండ్ల మనోహర్ చెప్పారంటే ఏదో జరిగే ఉంటుంది. కచ్చితంగా పవన్ కోసం చిరు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారు. జనసేనను బలోపేతం చేస్తారు.” తెలుగు మీడియాలో జరుగుతున్న హడావిడి అంతా ఇంతా కాదు. స్థానిక ఎన్నికల వేళ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే మనోహర్ అలాంటి మాటలు మాట్లాడారని కొంతమంది అంటుంటే.. కాదుకాదు నిజంగానే చిరంజీవి రీఎంట్రీకి మనోహర్ మాటలే నిదర్శనం అని మరికొందరు వివరణ ఇస్తున్నారు.

ఇంతకీ మనోహర్ ఏమన్నారు..
“పవన్ ‌కల్యాణ్‌ మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది చిరంజీవే. ఇంకొన్నాళ్లు సినిమాలు చేయాలని పవన్‌ కు చిరంజీవి సూచించారు. ఆయన సూచన వల్లే పవన్ మళ్లీ సినిమాలు చేస్తున్నారు. రెండు మూడేళ్ల తర్వాత అంటే వచ్చే ఎన్నికలనాటికి పవన్‌ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి కూడా ఉంటానన్నారు.” పవన్, చిరు ఏకాంత భేటీలో ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చినట్టు చెప్పారు నాదెండ్ల మనోహర్.

చిరు అంత ధైర్యం చేస్తారా..?
నిజంగానా రాజకీయాల్లో ఏదో సాధించాలనే పట్టుదల ఉంటే చిరంజీవి అర్థాంతరంగా పార్టీ మూసేసేవారు కాదు. ప్రజా రాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసి మంత్రి పదవి తీసుకుని సరిపెట్టుకునేవారూ కాదు. స్వతంత్రంగానే ఉంటూ తాడో పేడో తేల్చుకునేవారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే చిరంజీవి కాంగ్రెస్ లోనే కొనసాగేవారు. కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా పునరుద్ధరించుకోకుండా కాంగ్రెస్ తో తెగతెంపులు చేసేసుకుని తన మానాన తాను సినిమాలు చేసుకుంటున్నారు. అసలు రాజకీయాలు మాట్లాడటమే మానేశారు. అటు కేసీఆర్, ఇటు జగన్.. ఇద్దరినీ మర్యాదపూర్వకంగా కలుస్తూ.. తన సినిమా లెక్కలు తాను వేసుకుంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు వీర్రాజే కాదు, ఇంకెవరు ఇంటికొచ్చినా చిరునవ్వుతో పలకరించే చిరంజీవి అందరివాడు అనిపించుకుంటున్నారు. అలాంటి చిరంజీవి ఇప్పుడైనా, ఎప్పుడైనా.. తిరిగి రాజకీయాల్లోకి వస్తారనుకోవడం కలే. చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, పవన్ కల్యాణ్ కి సపోర్ట్ చేయడం, వెనకుండి జనసేనను నడిపించడం అన్నీ ఊహాగానాలే. చిరు, పవన్ మధ్య జరిగిన ఏకాంత చర్చలపై నాదెండ్ల మనోహర్ వివరణను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని విశ్లేషకుల అభిప్రాయం. ఏపీలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని జనసేన-బీజేపీ చెబుతున్నా కూడా.. అది అంత సులభం కాదని అర్థమవుతూనే ఉంది. ఒకవేళ టీడీపీ మరీ అంత బలహీన పడితే.. అది వైసీపీకే లాభం అవుతుంది కానీ, ఇతరులు అసెంబ్లీలో అంత సులువుగా పాగా వేయడం ఏపీలో కష్టం. ఈ దశలో చిరంజీవి సపోర్ట్ తీసుకుని పవన్ ఏం సాధిస్తారనేదే ప్రశ్న. చిరంజీవి-పవన్ కల్యాణ్ కలయిక, మాంచి మల్టీస్టారర్ మూవీకి పనికొచ్చే సబ్జెక్టే కానీ, రాజకీయాలకు మాత్రం కాదనేది వాస్తవం.

First Published:  27 Jan 2021 8:20 AM GMT
Next Story