ఎవరీ దీప్​ సిద్దూ ?

వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా నిన్న ఢిల్లీలో జరిగిన అన్నదాతల ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ర్యాలీ హింసాత్మకంగా మారింది. అసాంఘిక శక్తులు ర్యాలీలోకి చొరబడ్డాయని.. వాళ్లే రైతుల ట్రాక్టర్​ ర్యాలీని దారి మళ్లించి ఎర్రకోట వైపు తీసుకెళ్లారని ఏకంగా రైతు సంఘాలే ఆరోపిస్తున్నాయి. నిన్న జరిగిన అల్లర్లలో ‘దీప్​ సిద్దూ’ అనే పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. అతడే రైతన్నలను రెచ్చగొట్టి హింసకు పాల్పడేలా చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు దీప్​ సిద్దూకు రైతుసంఘాలకు ఎటువంటి సంబంధం లేదని.. అతడు బీజేపీ కార్యకర్త అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు 2019 ఎన్నికల సమయంలో దీప్​ సిద్దూ ప్రధాని నరేంద్రమోదీతో కలిసి ఉన్నో ఫొటో కూడా ఇప్పుడు వైరల్​ అవుతున్నది. అయితే ఈ ఫొటోను ప్రముఖ లాయర్​ ప్రశాంత్​ భూషణ్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేయడం గమనార్హం. అయితే ఇప్పుడు దీప్​ సిద్దూ ఎవరూ? అన్న విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

పంజాబ్​కు చెందిన దీప్​ సిద్దూ సింగర్​. పలు హిందీ పంజాబీ కూడా సినిమాల్లో నటించాడు. అయితే సిద్దూ మొదటి నుంచి రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. మరోవైపు నిన్న ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్​ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ర్యాలీకి ముందు సిద్దూ సోషల్​మీడియాలో పెట్టిన వీడియోలు వైరల్​గా మారాయి. ఈ వీడియోలో సిద్దూ రైతులను రెచ్చగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు ఎర్రకోటమీదకు వెళ్లి ‘నిశాన్​ సాహిబ్​’ జెండాలను ఎగరేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో సిద్దూ అక్కడే ఉన్నారు.

అయితే ఈ ఘటనపై భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ తికాయత్​ స్పందిస్తూ.. ‘దీప్​ సిద్దూ అస్సలు సిక్కు కాదు. అతడికి రైతు ఉద్యమంతో ఏ విధమైన సంబంధం లేదు. అతడు బీజేపీ కార్యకర్త. ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకే అతడు ఆందోళనలోకి వచ్చాడు’ అంటూ ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఘటనపై ఎన్​ఐఏ దర్యాప్తు చేస్తున్నది.