టీడీపీ గుర్తింపు రద్దు చేసే ధైర్యం ఈసీకి ఉందా..?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం లేదని, చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. పార్టీల ప్రమేయం లేకుండా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం వింతగా ఉందని, ఆ మేనిఫెస్టోపై లోకేష్ ఫొటో వేసుకోవడం మరింత విడ్డూరం అని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికలకు పార్టీలు మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అన్న అంబటి.. చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ గుర్తింపు రద్దుచేసే ధైర్యం ఎస్ఈసీకి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు, నిమ్మగడ్డ ఇద్దరూ కలసి పనిచేసినా.. ఆ పార్టీని బ్రతికించలేరని చెప్పారు.

ఏకగ్రీవాలపై ఏడుపెందుకు..?
పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా.. అని ప్రశ్నించిన అంబటి.. రాష్ట్రంలో, దేశంలో ఏకగ్రీవ ఎన్నికలు కొత్తగా జరుగుతున్నట్టు, ఏకగ్రీవమైన గ్రామ పంచాయితీలకు ప్రోత్సాహకాలు వైసీపీ ప్రభుత్వం మాత్రమే ఇస్తున్నట్టు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు ఉత్పన్నం కాకుండా ఏకగ్రీవాలు జరుగుతుంటాయి, వాటిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.

ఉషశ్రీ, చాగంటి, గరికపాటి, నిమ్మగడ్డ..
సుప్రీంకోర్టు తీర్పుల్ని ఆసరాగా తీసుకుని, ఎస్ఈసీ లేని అధికారాలు చలాయించాలనుకోవడం, కర్ర పెత్తనం చేయాలని చూడటం సరికాదని అన్నారు అంబటి. మితిమీరి ప్రవర్తించే వారికి అంతిమంగా ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. చాగంటి, ఉషశ్రీ, గరికపాటిని మించిపోయి నీతి ప్రవచనాలు వల్లిస్తున్న నిమ్మగడ్డ.. చంద్రబాబు మేనిఫెస్టోపై సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎస్ఈసీ తన అధికారాలు ఉపయోగించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని, ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో నివాసం ఉండే నిమ్మగడ్డకు, దుగ్గిరాలలో ఓటు హక్కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టు.. రాజ్యాంగబద్ధమైన పదవిలో నిమ్మగడ్డ లాంటి వారిని కూర్చోబెడితే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఘాటుగా విమర్శంచారు అంబటి.

బూతులు ఎప్పుడు నేర్చుకున్నావు బాబూ..
40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. చౌకబారు, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు అంబటి. సీఎం జగన్ ని పోటుగాడా అని బాబు ప్రశ్నించారని, వాస్తవానికి మామ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన బాబే పెద్ద పోటుగాడని ఎద్దేవా చేశారు. 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం తనకు దక్కదేమోనన్న భయంతో చంద్రబాబు పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి ఉంటారని చెణుకులు విసిరారు అంబటి. మీడియా సమావేశంలో చంద్రబాబు చెప్పిన లెక్కలు, గతంలో కేంద్ర హోంశాఖ సెక్రటరీకి నిమ్మగడ్డ రాసిన లేఖలో ఉన్నాయని, ఆ లెక్కల్ని నిమ్మగడ్డ బాబుకి చెప్పారా లేక, గతంలో బాబు, నిమ్మగడ్డకు వాటిని అప్పజెప్పారా అనేది తేలాల్సి ఉందని అన్నారు.

ఆన్ లైన్ నామినేషన్లకు అర్థం తెలుసా..?
ఆన్ లైన్ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని కొందరు అడుగుతున్నారని, అలా అడిగేవాళ్ళకు బుర్ర లేదని మండిపడ్డారు అంబటి. ఎన్నికల్లో వేలు ముద్ర వేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని, ఆన్ లైన్ నామినేషన్లంటే అది వారి హక్కులకు భంగం కలిగించడమేనని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా నామినేషన్లు ఆన్ లైన్ లో పెట్టాలని బీజేపీ వాళ్ళు సలహా ఇవ్వాలని సూచించారు.

పంచాయితీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలని, వాటిలో ఎవరు గెలిచినా సంతోషమేనని, ఏకగ్రీవంగా గెలిస్తే.. ఆ గ్రామాల్లో అభివృద్ధి బాగా జరుగుతుందని చెప్పారు అంబటి రాంబాబు.