Telugu Global
NEWS

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ " సంకటంలో కాషాయ పార్టీ

విశాఖ ఉక్కు పరిశ్రమ వాటాలను విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో కొత్త రాజకీయానికి దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మెజార్టీ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతల్లోనూ భిన్న స్వరాలు వినిపిస్తుండడం గమనార్హం. ఈ విషయంలో త్వరలోనే కేంద్రాన్ని సంప్రదించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. కాగా.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాత్రం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకోవట్లేదని, అందుకే వాటాల విక్రయానికి సిద్ధమైందని […]

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ  సంకటంలో కాషాయ పార్టీ
X

విశాఖ ఉక్కు పరిశ్రమ వాటాలను విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో కొత్త రాజకీయానికి దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మెజార్టీ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతల్లోనూ భిన్న స్వరాలు వినిపిస్తుండడం గమనార్హం. ఈ విషయంలో త్వరలోనే కేంద్రాన్ని సంప్రదించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. కాగా.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాత్రం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకోవట్లేదని, అందుకే వాటాల విక్రయానికి సిద్ధమైందని పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేసినంత మాత్రాన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదన్నారు. సుజనా చౌదరి వ్యాఖ్యలపై వైసీపీ, టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే ఫ్యాక్టరీని విశాఖ నుంచి విదేశాలకు తీసుకెళ్లరని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు ఎలాంటి నష్టముండదన్నారు. కాగా.. బీజేపీ మిత్రపక్షమైన జనసేన సైతం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఈ విషయంలో ప్రధానిని కలుస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ సైతం కేద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉక్కు కర్మాగారం ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమ 25 వేల నుండి 30 వేల కోట్ల నష్టాల్లో ఉందని, వాటిని అధిగమించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ అంశంపై ఆలోచించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. కాగా.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవటానికి దేనికైనా సిద్ధమన్న ఎంపీ, స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు ఎంవీవీ. కేంద్రం వెనక్కి తగ్గకపోతే స్టీల్ ప్లాంట్ వద్దే నిరాహార దీక్షకు దిగుతామన్నారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రైవేటీకరణపై అభిప్రాయాన్ని వెల్లడించకపోవడాన్ని ప్రతిపక్ష టీడీపీ తప్పుబట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో సేవ్ వైజాగ్ స్టీల్ పేరుతో క్యాంపెయిన్ మొదలైంది. వామపక్షాలు మొదలు మెజార్టీ రాజకీయ పక్షాలన్నీ ఈ ఉద్యమంలో భాగమవుతున్నాయి. కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. రోజు రోజురోజుకూ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ఉద్యమం ఊపందుకుంటోంది. మరోవైపు ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల నష్టం జరుగుతుందని భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మరి ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గుతుందా? లేక రాష్ట్ర బీజేపీ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంతో గొంతు కలుపుతుందా? అనేది వేచి చూడాలి.

First Published:  6 Feb 2021 1:26 AM GMT
Next Story