Telugu Global
NEWS

ఆ రెండూ చేస్తే సమస్య పరిష్కారం " విశాఖ ఉక్కుపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రానికి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్.. కీలక ప్రతిపాదనలు అందులో పొందుపరిచారు. రుణ భారాన్ని తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, రుణాలను బ్యాంకులు ఈక్విటీలుగా మార్చితే వడ్డీభారం తగ్గుతుందని చెప్పారు. అదే సమయంలో సొంత గనులు లేక విశాఖ ఉక్కు కర్మాగారం మార్కెట్లోని ఇతర ఫ్యాక్టరీలతో పోటీ పడలేకపోతోందని, తగినంత సాయం చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టాలని కోరారు. రాష్ట్రానికి అత్యంత విలువైన ఆభరణమైన విశాఖ […]

ఆ రెండూ చేస్తే సమస్య పరిష్కారం  విశాఖ ఉక్కుపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ
X

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రానికి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్.. కీలక ప్రతిపాదనలు అందులో పొందుపరిచారు. రుణ భారాన్ని తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, రుణాలను బ్యాంకులు ఈక్విటీలుగా మార్చితే వడ్డీభారం తగ్గుతుందని చెప్పారు. అదే సమయంలో సొంత గనులు లేక విశాఖ ఉక్కు కర్మాగారం మార్కెట్లోని ఇతర ఫ్యాక్టరీలతో పోటీ పడలేకపోతోందని, తగినంత సాయం చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టాలని కోరారు. రాష్ట్రానికి అత్యంత విలువైన ఆభరణమైన విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖతో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందన హామీ ఇచ్చారు.

లాభ నష్టాలు ఇలా..
ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా మరింతమందికి ఉపాధి కల్పిస్తోన్న విశాఖ ఉక్కు కర్మాగారం.. 2002 నుంచి 2015 వరకు లాభాల బాటలో నడిచిందని చెప్పారు జగన్. కర్మాగారానికి ఉన్న 19,700 ఎకరాల భూముల విలువే ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉక్కు రంగంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల వల్ల 2014-15 నుంచి విశాఖ ఉక్కు మళ్లీ నష్టాల్లో పడిందన్నారు. ఆంగ్ల అక్షరమాలలోని వి అక్షరం లాగా.. తిరిగి విశాఖ కర్మాగారం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సొంత గనులు లేకే..
సొంత గనులు లేకపోవడం ఉత్పాదక వ్యయం పెరగడానికి ప్రధాన కారణమని తన లేఖలో ప్రస్తావించారు జగన్. విశాఖ ఉక్కు కర్మాగారం బైలదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని మార్కెట్‌ ధరకు, అంటే టన్ను రూ.5200కి కొంటోందని అన్నారు జగన్. కేంద్ర ప్రభుత్వ రంగంలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కు 200 ఏళ్ల అవసరాలకు సరిపడా ముడి ఖనిజాన్ని అందించే సొంత గనులున్నాయని, విశాఖ ఉక్కుకి ఆ వెసులుబాటు లేదని అన్నారు. దీని వల్ల ఏటా రూ.3,472 కోట్లకు పైగా భారం పడుతోందని, ఒడిశాలోని కొన్ని గనుల్ని విశాఖ కర్మాగారానికి కేటాయిస్తే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశారు.

ఈక్వీటీగా మారిస్తే ఇబ్బందులు ఉండవు..
విశాఖ ఉక్కు సంస్థ రుణభారం రూ.22 వేల కోట్లుగా ఉందని, దీనిపై 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందని ఇది మరింత ఆర్థిక భారంగా మారిందని లేఖలో ప్రస్తావించారు సీఎం జగన్. ఆ రుణాల్ని బ్యాంకులు ఈక్విటీగా మారిస్తే.. వడ్డీ భారం పూర్తిగా పోవడంతో పాటు, స్టాక్‌ ఎక్స్ఛేంజిలో లిస్ట్‌ అయ్యే అవకాశం లభిస్తుందని, స్టాక్‌ మార్కెట్‌ ద్వారా ప్రజల నుంచి నిధుల సమీకరణకు వీలు కలుగుతుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటు గరిష్ఠ ఉత్పాదక సామర్థ్యం సంవత్సరానికి 73 లక్షల టన్నులు కాగా, 2020 డిసెంబరు నుంచి 63 లక్షల టన్నులకు చేరుకుందని, నెలకు రూ.200 కోట్ల చొప్పున లాభాలు ఆర్జిస్తుందని, మరో రెండేళ్లు అదే పనితీరు కనబరిస్తే పరిశ్రమ ఆర్థికస్థితి గణనీయంగా మెరుగుపడుతుందని కూడా వివరించారు.

First Published:  6 Feb 2021 8:30 PM GMT
Next Story