Telugu Global
NEWS

బీజేపీ కొత్త వ్యూహం " అధికార పార్టీని ఒంటరి చేసే యత్నం

నిన్నా మొన్నటి దాకా ఎన్నికల చుట్టూ తిరిగిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో కొత్త పంథాను అనుసరిస్తోంది. దుబ్బాక ఎన్నికల తరువాత దూకుడు పెంచిన కాషాయ పార్టీ, ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు తమదే అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. అనుకున్నది సాధించాలంటే అధికార పార్టీని ప్రజల్లో ఒంటరి చేయాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అందులో భాగంగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ పావులు కదుపుతోంది. తాజాగా సూర్యాపేట జిల్లాలో బీజేపీ శ్రేణులు చేసిన హడావిడి అందులో భాగమే. […]

బీజేపీ కొత్త వ్యూహం  అధికార పార్టీని ఒంటరి చేసే యత్నం
X

నిన్నా మొన్నటి దాకా ఎన్నికల చుట్టూ తిరిగిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో కొత్త పంథాను అనుసరిస్తోంది. దుబ్బాక ఎన్నికల తరువాత దూకుడు పెంచిన కాషాయ పార్టీ, ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు తమదే అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. అనుకున్నది సాధించాలంటే అధికార పార్టీని ప్రజల్లో ఒంటరి చేయాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అందులో భాగంగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ పావులు కదుపుతోంది. తాజాగా సూర్యాపేట జిల్లాలో బీజేపీ శ్రేణులు చేసిన హడావిడి అందులో భాగమే.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మఠంపల్లి మండలం పెద్దవీడు పరిధిలోని 540 సర్వే నెంబర్ లోని వివాదాస్పద భూమిని సదర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన గిరిజన భరోసా యాత్రలో భాగంగా బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ సహా పలువురు సీనియర్ బీజేపీ నేతలు వివాదస్పద స్థలాన్ని విజిట్ చేశారు. ఆ స్థలంలో ఓ ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేసిన షెడ్‌పై బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరి షెడ్‌ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

గుర్రంపోడు తండాలో సర్వేనంబర్ 540 భూములు కబ్జాకు గురయ్యాయంటూ కొంతకాలంగా స్థానిక గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకునే పేరుతో గుర్రంపోడు తండాకు వెళ్లిన బీజేపీ రణరంగాన్ని సృష్టించింది. నాగార్జునసాగర్ నిర్వాసిత గిరిజనుల భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని, సర్వేనంబర్ 540లోని 18వందల 76 ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని ఈ సందర్భంగా బీజేపీ నేతలు విమర్శించారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, టీఆర్ఎస్ నేతలు భూ దందా చేస్తున్నారని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీని విలువలు లేని అవినీతి పార్టీగా బండి సంజయ్ అభివర్ణించారు. బీజేపీకి ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని, పేదల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. పేదల ఉసురు సీఎం కేసీఆర్‌కు తగులుతుందంటూ హెచ్చరించారు. విజయశాంతి సైతం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందన్నారు. మరోపదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ నాశనం అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ యుముడయ్యాడని, ఇప్పుడు బీజేపీ వచ్చింది.. అడుగడుగునా నిలదీస్తుంది అని అన్నారు. మొత్తానికి అధికార పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ దొరికిన ప్రతి అవకాశాన్నీ వాడుకోవాలనుకుంటోంది. మరి బీజేపీ ఈ కొత్త వ్యూహం ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.

First Published:  8 Feb 2021 1:40 AM GMT
Next Story