Telugu Global
NEWS

ముఖ్యమంత్రిని ముసిరిన కొత్త చిక్కులు

ముఖ్యమంత్రి మార్పుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారానికి చెక్ పెట్టే క్రమంలో కేసీఆర్ ఘాటుగా స్పందించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, మరో పదేళ్లు సీఎంగా ఉంటానని స్పష్టం చేసిన కేసీఆర్ తనకు ముఖ్యమంత్రి పదవి కాలి చెప్పుతో సమానమని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు కొత్త ఆయుధాన్ని అందించాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ అహంకారంతో తెలంగాణ […]

ముఖ్యమంత్రిని ముసిరిన కొత్త చిక్కులు
X

ముఖ్యమంత్రి మార్పుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారానికి చెక్ పెట్టే క్రమంలో కేసీఆర్ ఘాటుగా స్పందించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, మరో పదేళ్లు సీఎంగా ఉంటానని స్పష్టం చేసిన కేసీఆర్ తనకు ముఖ్యమంత్రి పదవి కాలి చెప్పుతో సమానమని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు కొత్త ఆయుధాన్ని అందించాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ అహంకారంతో తెలంగాణ ప్రజలను అవమానించారంటూ దుయ్యబడుతున్నాయి.

సీఎం పదవిని కాలి చెప్పుతో పోల్చిన కేసీఆర్‌ను పదవి నుండి తొలగించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ తమిళిసైకు రాసిన లేఖలో టీఆర్‌ఎస్‌ పార్టీలో కేసీఆర్‌పై విశ్వాసం సన్నగిల్లిందని, ఆయన కుటుంబం ఎమ్మెల్యేల నమ్మకం కోల్పోయిందని పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అరవింద్ కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. టీఆర్‌ఎస్‌ కార్యకవర్గ సమావేశం గులాబీ డ్రామాలకు తెరదించిందన్నారు. ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదురవుతుండడంతో ముఖ్యమంత్రి అభద్రతాభావాన్ని ఫేస్ చేస్తున్నారని, అందుకే ఎమ్మెల్యేలపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఏ హక్కుతో శాసనసభ్యులను బెదిరిస్తున్నారని ప్రశ్నించారు.

మరోవైపు ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ని కోరారు. ముఖ్యమంత్రి పదవిని ఎడమకాలి చెప్పుతో పోల్చిన కేసీఆర్ రాజ్యాంగాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించారన్నారు. లేఖ ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సైతం పంపారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆరే తెలంగాణ ప్రజలకు ఎడమ కాలు చెప్పుతో సమానమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆయనపై ఒత్తిడి చేస్తున్నారని, ఇంటి పోరు భరించలేకే కేసీఆర్ ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని చెప్పుతో పోల్చిన కేసీఆర్‌ ఆ పదవికి అనర్హుడని, ఆయన వ్యాఖ్యలు దొరహంకారానికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తనయుడికి పట్టంగట్టాలనుకున్న కేసీఆర్ ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అసహనంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకున్నాయి. కేసీఆర్ హెచ్చరికలతో సొంత పార్టీ నేతలు కిక్కురుమనకుండా పోయినా.. ప్రతిపక్షాలు మాత్రం ఎదురుదాడి చేస్తున్నాయి. మొత్తానికి ముఖ్యమంత్రి మార్పు ముచ్చట ఇప్పటికి అటకెక్కినట్లు కనిపించినా మరో మంచి ముహుర్తాన యువరాజుకు పట్టంగట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయం. మరి తెలంగాణ పాలనా పగ్గాలు పెద్దాయన చేతుల్లోనే ఉంటాయా? యువరాజు చేతికి మారుతాయా? అనేది వేచిచూడాలి.

First Published:  8 Feb 2021 11:18 PM GMT
Next Story