Telugu Global
National

ఆజాద్ పై మోదీ ప్రశంసల జల్లు.. అసలేంటి కథ..?

రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవర్తనతో అందరూ షాకయ్యారు. ఆజాద్ రాజకీయాలనుంచి వైదొలగలేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ కి బలం లేదు కాబట్టి.. మరికొన్నాళ్లు రాజ్యసభ సీటుకోసం వేచి చూడాల్సి వస్తుందంతే. అంత మాత్రాన ఆయనేదో రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు, ఇకపై సభకే రాడన్నట్టు ప్రధాని మోదీ సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. భావోద్వేగానికి గురై […]

ఆజాద్ పై మోదీ ప్రశంసల జల్లు.. అసలేంటి కథ..?
X

రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవర్తనతో అందరూ షాకయ్యారు. ఆజాద్ రాజకీయాలనుంచి వైదొలగలేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ కి బలం లేదు కాబట్టి.. మరికొన్నాళ్లు రాజ్యసభ సీటుకోసం వేచి చూడాల్సి వస్తుందంతే. అంత మాత్రాన ఆయనేదో రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు, ఇకపై సభకే రాడన్నట్టు ప్రధాని మోదీ సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. భావోద్వేగానికి గురై ఆజాద్ కి సెల్యూట్ చేశారు కూడా.

అసలేంటి కథ..?
ఆజాద్ విపక్ష నేతగా పెద్ద బాధ్యత నెరవేర్చారని, ఆయన స్థానాన్ని భర్తీ చేసేవారెవరూ లేరని పొగడ్తల డోస్ బాగానే పెంచారు మోదీ. అయితే ఈ ప్రేమ ఇప్పటికిప్పుడు పుట్టింది కాదని, గతంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆజాద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారని, అప్పటినుంచి తమ మధ్య ప్రత్యేక బంధం ఉందని గుర్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులకు మాత్రం మోదీ వ్యవహారం మింగుడు పడలేదు. కాంగ్రెస్ తరపున కూడా ఎవరూ ఆజాద్ ని ఆ స్థాయిలో ప్రశంసించలేదు. ఇటీవల అధినాయకత్వాన్ని ధిక్కరిస్తూ లేఖరాసిన సీనియర్లలో ఆజాద్ కూడా ఒకరు. అప్పటినుంచీ ఆయనతో పార్టీ అంటీ ముట్టనట్టుగానే ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఈ సీనియర్ల పొడ గిట్టట్లేదు. ఈ దశలో ఆజాద్ కూడా తన పని తాను చేసుకుని వెళ్తున్నారు.

ఆజాద్ రాజకీయ ప్రయాణం మారుతుందా..?
కాంగ్రెస్ కి దూరంగా జరుగుతున్న ఆజాద్ ని మోదీ దగ్గరకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. కాశ్మీర్ విభజనతో వచ్చిన వ్యతిరేకతను.. అదే రాష్ట్రానికి చెందిన నేతను తమవైపు తిప్పుకోవడం ద్వారా నెగ్గుకు రావచ్చనేది మోదీ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు మోదీ ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పలేం కానీ, భవిష్యత్ లో కాంగ్రెస్-ఆజాద్ సంబంధాలపై బీజేపీ తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. అదే సమయంలో వీడ్కోలు తీసుకుంటున్న సందర్భంగా ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. మాజీ ప్రధాని వాజ్ ‌పేయితోనూ తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారాయన. బీజేపీతో కాకుండా, వాజ్ పేయితో టచ్‌లో ఉండాలని ఇందిరాగాంధీ తనకు చెప్పేవారని అన్నారు. భారత దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమేయాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మొత్తమ్మీద ఆజాద్ వ్యాఖ్యల్లో కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీ పేరే వినిపించింది. దీంతో పార్లమెంట్ లో మోదీ ఉద్వేగ ప్రసంగం వెనక కూడా ఏదో కథ ఉండే ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి.

First Published:  10 Feb 2021 1:15 AM GMT
Next Story