Telugu Global
NEWS

సాగర్ అభ్యర్థిపై టీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చినట్టేనా..?

దుబ్బాకను కోల్పోవడం, ఆ తర్వాత జీహెచ్ఎంసీ విషయంలో ఘోర పరాభవం ఎదురు కావడంతో.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై కేసీఆర్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా సాగర్ ని ఒడిసి పట్టాలనే ఉద్దేశంతో ఆయన దూకుడు పెంచారు. ఇటీవల కేసీఆర్ పేల్చుతున్న మాటల తూటాలు కూడా ఆయన వ్యవహార శైలి మారిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభలో సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థి పేరు ప్రకటిస్తారని అందరూ […]

సాగర్ అభ్యర్థిపై టీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చినట్టేనా..?
X

దుబ్బాకను కోల్పోవడం, ఆ తర్వాత జీహెచ్ఎంసీ విషయంలో ఘోర పరాభవం ఎదురు కావడంతో.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై కేసీఆర్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా సాగర్ ని ఒడిసి పట్టాలనే ఉద్దేశంతో ఆయన దూకుడు పెంచారు. ఇటీవల కేసీఆర్ పేల్చుతున్న మాటల తూటాలు కూడా ఆయన వ్యవహార శైలి మారిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభలో సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థి పేరు ప్రకటిస్తారని అందరూ ఆశించారు. కానీ, కేసీఆర్ అలాంటి ప్రకటన జోలికి వెళ్లలేదు. కనీసం మూడు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించిన పల్లా రాజేశ్వర రెడ్డిని కూడా స్టేజ్ పైకి పిలవలేదు. కేవలం ప్రతిపక్షాలను తూర్పారబట్టడానికి, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడానికి మాత్రమే సభను ఉపయోగించుకున్నారు.

నోముల నర్సింహయ్య కుటుంబానికి వట్టిచెయ్యేనా..?
నోముల నర్సింహయ్య మరణంతో వస్తున్న ఉప ఎన్నికల్లో వారి కుటుంబానికే టికెట్ ఇస్తారని అనుకుంటున్నారంతా. వామపక్ష నాయకుడిగా పేరు తెచ్చుకున్న నర్సింహయ్య.. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. సాగర్ లో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డిపై ఆయన విజయం సాధించారు. అనారోగ్యం వల్ల నర్సింహయ్య హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. వరుస విజయాలతో ఊపుమీదున్న బీజేపీ, సాగర్ ని కూడా దక్కించుకోవాలని చూస్తోంది. అటు కాంగ్రెస్ కూడా తమకి పట్టున్న స్థానంలో పట్టు నిలుపుకోవాలనుకుంటోంది. అందరికంటే ముందుగానే జానారెడ్డి పేరు ఖరారు చేసి రాజకీయ కాక రేపింది. ఇక టీఆర్ఎస్ మాత్రం నోముల నర్సింహయ్య కుటుంబానికి టికెట్ ఇవ్వాలా లేక దుబ్బాక ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర బలమైన అభ్యర్థికోసం గాలించాలా అనే విషయంలో ఊగిసలాడుతోంది. వాస్తవానికి చనిపోయిన నాయకుడి కుటుంబానికి టికెట్ ఇచ్చేట్టయితే ముందుగానే వారి పేరు ప్రకటిస్తారు, లేదా ఆ కుటుంబానికే టికెట్ ఇస్తామని క్లారిటీ ఇస్తారు. కానీ కేసీఆర్ గుంభనంగా ఉన్నారంటే దానర్థం వేరే ఉందని తెలుస్తోంది. హాలియా బహిరంగ సభను సాగర్ ఉప ఎన్నికకు శంఖారావంలా భావిస్తారనుకుంటున్న సమయంలో అభ్యర్థి పేరుని ప్రస్తావించకపోవడం విచిత్రమే. అయితే అదే సమయంలో నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడంలేదనే విషయం కూడా దాదాపుగా నిర్థారణ అయింది. అదే జరిగితే ఈ పాటికే నర్సింహయ్య కుటుంబంతో కేసీఆర్ చర్చలు జరిపేవారు, వారికి హామీ ఇచ్చేవారు, వీలయితే అభ్యర్థి పేరు సభలో ప్రకటించేసేవారు. కేసీఆర్ సాచివేత ధోరణి చూస్తే సాగర్ లో టీఆర్ఎస్ బలమైన అభ్యర్థికోసం దుర్భిణి వేసి చూస్తోందనే విషయం స్పష్టమవుతోంది.

First Published:  10 Feb 2021 11:18 PM GMT
Next Story