సామాజిక మాద్యమాలపై సమరానికి సిద్ధమవుతున్న కేంద్రం

రైతు ఉద్యమానికి మద్దతుగా సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని కట్టడిచేయకపోవడం పట్ల ట్విట్టర్ పై మండిపడుతోంది. మోదీ ప్లానింగ్‌ ఫార్మర్స్‌ జెనోసైడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో జరుగున్న ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ట్విట్టర్ ఎలా ఈ ప్రచారానికి అనుమతించిందని ప్రశ్నించింది. “ఏం తమాషా చేస్తున్నారా?” అంటూ తీవ్రస్వరంతో స్పందించింది. రాజ్యాంగంలోని 19(2) అధికరణం ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛ ఉందని, దేశ సమగ్రత, సార్వభౌమత్వం దృష్ట్యా కొన్ని నియంత్రణలు తప్పవని వ్యాఖ్యానించింది. తప్పుడు వార్తలు, హింసను, పరస్పర ద్వేషాన్ని ప్రేరేపించే పోస్టులను సహించబోమని తేల్చిచెప్పింది.

వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రపంచ వ్యాపంగా మద్దతు లభిస్తోంది. పలువురు అంతర్జాతీయ సెలబ్రెటీలు ట్విట్టర్ లాంటి సామాజిక మాద్యమాల ద్వారా రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే రాజ్యసభ వేదికగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్, వాట్సా్‌ప్ లాంటి సామాజిక మాద్యమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో సామాజిక మాద్యమాలను వినియోగిస్తున్న వాళ్లు కోట్లాది మంది ఉన్నారని, ఆయా సంస్థలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చన్న మంత్రి.. అది చట్టాలకు లోబడి మాత్రమే అని స్పష్టం చేశారు. అందరూ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే అని, ఇష్టానుసారంగా హింసను ప్రేరేపించేలా ప్రవర్తిస్తే సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతుల ఆందోళనను సమర్థిస్తున్న ఖాతాలను నిషేధించాలని కేంద్రం కోరినా ట్విట్టర్‌ వాటిపై చర్యలు తీసుకోకపోవడాన్ని రవిశంకర్‌ ప్రసాద్‌ తప్పుబట్టారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాద్యమాలు ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నాయని అన్నారు. అమెరికా కేపిటల్‌ భవనంపై దాడి జరిగినప్పుడు అక్కడి పరిపాలనా యంత్రాంగానికి అండగా నిలిచిన సామాజిక మాధ్యమాలు, ఇక్కడ ఎర్రకోటలో హింస చెలరేగితే పోలీసులకు వ్యతిరేకంగా నిలవడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను ఎలా అనుమతిస్తారు? అని నిలదీశారు. చట్టాన్ని అతిక్రమిస్తే సామాజిక మాధ్యమాలపై చర్యలు తప్పవన్నారు.

ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను నియంత్రించడానికి కేంద్రం చట్టపరంగా దుకెళ్లాలనుకుంటోంది. అందులోభాగంగా సామాజిక మాద్యమాలు, ఓటీటీ, న్యూస్ వెబ్ సైట్స్ ను కట్టడి చేసేందుకు ఎథిక్స్‌ కోడ్ ను రూపొందించింది. కోడ్‌ ముసాయిదాను కేంద్ర ఐటీ శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. కోడ్ ప్రకారం పోలీసు, భద్రతా సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైనా సామాజిక మాద్యమాల్లో పోస్ట్ అయిన కంటెంట్ పై ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందించేలా ఓ అధికారి అందుబాటులో ఉండాలని షరతు విధించనున్నది. ఈ విషయంపై మైక్రొసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల స్పందిస్తూ స్వీయ నియంత్రణ చేసుకోవాలని సామాజిక మాధ్యమాలకు చెప్పేకంటే వాటిని కట్టడిచేసేందుకు స్పష్టమైన చట్టాలను రూపొందించాలన్నారు.