Telugu Global
NEWS

రాజకీయ ప్రయోజనాలు కాదు.. వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని పోస్కో కంపెనీకి వైసీపీ ప్రభుత్వమే అమ్మేస్తోందని చంద్రబాబు వితండ వాదం చేస్తున్నారని, అసలా అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటే ఆయన ఇన్నాళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ను మిగిల్చే వారు కాదని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో ప్రైవేటీకరణ బాట పట్టిన 54 కంపెనీల పక్కన […]

రాజకీయ ప్రయోజనాలు కాదు.. వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం..
X

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని పోస్కో కంపెనీకి వైసీపీ ప్రభుత్వమే అమ్మేస్తోందని చంద్రబాబు వితండ వాదం చేస్తున్నారని, అసలా అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటే ఆయన ఇన్నాళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ను మిగిల్చే వారు కాదని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో ప్రైవేటీకరణ బాట పట్టిన 54 కంపెనీల పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా నిలిచేదని చెప్పారు. ఆ అవకాశం లేకే చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ని వదిలిపెట్టారని, తన హయాంలో కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంటున్నా మిన్నకుండిపోయారని, ఇప్పుడు జగన్ సర్కారుపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్న రోజుల్లోనే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయని గుర్తు చేశారు. పోస్కో కంపెనీ వాళ్ళు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే వచ్చారని, బాబుతో ఫొటోలు కూడా దిగారని అన్నారు. 2002 నుంచి 2015 వరకు విశాఖ ఉక్కు లాభాల్లో ఉందని, బాబు పాలనలో 2016 నుంచి నష్టాల్లోకి వచ్చిందని, ఆ సాకుతోనే దాన్ని ప్రైవేటు పరం చేయటానికి రంగం సిద్ధమయిందని, ఆ విషయాన్ని 2018లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించినా.. చంద్రబాబు నోరెత్తలేదని అన్నారు. బాబుకి విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే సుజనా స్టీల్స్ బాగా తెలుసని ఎద్దేవా చేశారు.

స్టీల్ ప్లాంట్ కోసమా, తిరుపతి సీటు కోసమా..?
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు సీఎం జగన్ కేవలం లెటర్ రాసి సరిపెడతారా అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నించడాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టారు అంబటి రాంబాబు. బీజేపీతో సంసారం చేస్తున్న పవన్ కల్యాణ్ కు కేంద్రంతో మాట్లాడి, ఒప్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఇక్కడ ప్రగల్భాలు పలికి.. ఢిల్లీ వెళ్ళి విశాఖ ఉక్కు గురించి డిమాండ్ చేయకుండా, తిరుపతి సీటుకోసం బతిమిలాడుకున్నారని జనసేనానిపై సెటైర్లు వేశారు అంబటి. బీజేపీతో సయోధ్యగా ఉండి, కలిసి పోటీ చేసే పరిస్థితిలో ఉండి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేకపోవడం, ఆ దిశగా కేంద్రాన్ని ఒప్పించలేకపోవడం పవన్ కల్యాణ్ అసమర్థత అవుతుందని అన్నారు అంబటి.
స్టీల్ ప్లాంట్ కేవలం విశాఖకు మాత్రమే కాకుండా రాష్ట్రానికి ఆభరణం అని అందుకే దాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతోనే సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని చెప్పారు. ఆంధ్రుల హక్కును కాపాడాల్సిన, గౌరవించాల్సిన బాధ్యత కేంద్రం పై కూడా ఉందని గుర్తు చేశారాయన. అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందనుకుంటే.. తప్పకుండా చేద్దామని, రాష్ట్ర ప్రయోజనాలే వైసీపీకి ముఖ్యం అని, రాజకీయ ప్రయోజనాలు కాదని స్పష్టం చేశారు.

లోకేష్ కంటే గొప్పవాళ్లు టీడీపీలో 510మంది ఉన్నారు..
తాను పోటీ చేసిన చోట గెలవడం చేతగాని నారా లోకేష్.. రాష్ట్రంలోని పంచాయతీలన్నిటిలో టీడీపీ గెలిచిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు అంబటి. పట్టుమని 10 పంచాయతీలు కూడా టీడీపీకి రాలేదన్నారు. లోకేష్ వ్యాఖ్య‌లు చూస్తుంటే.. తన కంటే గొప్పవాళ్ళయిన 510 మంది తన పార్టీ సహకారంతో ప్రత్యక్ష ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచారని లోకేషే ఒప్పుకున్నట్టయిందని అన్నారు. అబద్దాలాడటం తండ్రి దగ్గరే లోకేష్ నేర్చుకున్నారని అన్నారు. తొలి దశలోనే కాదు, నాలుగు దశల్లోనూ.. పంచాయతీ ఎన్నికల్లో నూటికి 90 శాతం వైసీపీ మద్దతుదారులు గెలుస్తారని జోస్యం చెప్పారు అంబటి.

First Published:  12 Feb 2021 2:57 AM GMT
Next Story