Telugu Global
NEWS

పంచాయతీ బలప్రదర్శనలో టీడీపీది ప్రేక్షక పాత్ర..

ఎవరు ఔనన్నా కాదన్నా రాష్ట్రంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ బలపరచిన అభ్యర్థులకు 50శాతం సీట్లు వచ్చాయని, ఇంకొన్నిసార్లు 35శాతం పాస్ మార్కులు వచ్చాయని చెప్పుకుంటున్న ఆ పార్టీ నేతలు.. చివరిగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అనడంతో వారి మాటల్ని వారే శంకిస్తున్నట్టు అర్థమవుతోంది. వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు తొలి మెట్టు అని చెబుతున్న చంద్రబాబే.. తమ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని, ఎస్ఈసీ పనితీరు సక్రమంగా లేదని […]

పంచాయతీ బలప్రదర్శనలో టీడీపీది ప్రేక్షక పాత్ర..
X

ఎవరు ఔనన్నా కాదన్నా రాష్ట్రంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ బలపరచిన అభ్యర్థులకు 50శాతం సీట్లు వచ్చాయని, ఇంకొన్నిసార్లు 35శాతం పాస్ మార్కులు వచ్చాయని చెప్పుకుంటున్న ఆ పార్టీ నేతలు.. చివరిగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అనడంతో వారి మాటల్ని వారే శంకిస్తున్నట్టు అర్థమవుతోంది. వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు తొలి మెట్టు అని చెబుతున్న చంద్రబాబే.. తమ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని, ఎస్ఈసీ పనితీరు సక్రమంగా లేదని విమర్శించడంతో టీడీపీ శ్రేణులు డైలమాలో పడ్డాయి. వైసీపీ గెలుపుని చంద్రబాబు ధృవీకరిస్తున్నారా అనే అనుమానం వారిలో మొదలైంది.

వైసీపీ వర్సెస్ వైసీపీ..
దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏకగ్రీవాలు మినహా పోటీ వైసీపీ అభ్యర్థుల మధ్యే జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీడీపీ సామాజిక వర్గం బలంగా ఉన్న పల్లెల్లో మాత్రం వైసీపీ అడుగుపెట్టలేకపోయింది. ఏకగ్రీవం అయినా, పోటీ అయినా ఆ సామాజికవర్గం మధ్య మాత్రమే సాగింది. పోనీ రిజర్వేషన్లు ఉన్నా కూడా ఊరి పెద్దల నిర్ణయమే ఫైనల్ అయింది. బలహీన అభ్యర్థులను డమ్మీలుగా పెట్టుకుని రాజకీయం నడిపించారు టీడీపీ నేతలు. మిగతా చోట్ల మాత్రం పరిస్థితి వైసీపీ వర్సెస్ వైసీపీగానే సాగింది. అంతమాత్రాన వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయని చెప్పలేం. స్థానికంగా తమ బలం ఏంటో నిరూపించుకునేందుకు వైసీపీలోని రెండు వర్గాలు పోటీ పడ్డాయి. ఎవరు గెలిచినా చివరకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి వీర తిలకం దిద్దించుకుంటారు కాబట్టి పార్టీ దీనిపై కలతచెందలేదు. అదే సమయంలో టీడీపీ మాత్రం కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. రెండో విడత ఎన్నికలు జరిగిన 3328 పంచాయతీల్లో ఫలితాలు ఆలస్యమైనవి మినహా మిగతా చోట్ల 2280 స్థానాల్లో వైసీపీ బలపరచిన అభ్యర్థులు, కేవలం 420 స్థానాల్లో టీడీపీ మద్దతు దారులు గెలిచారని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. ఈ లెక్కలు చూస్తే టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారాయన. అయితే యథావిధిగా వారు ఎన్నికల్లో గెలిచారు, మేము ప్రజల మనసులు గెలిచాం.. అనే పడిగట్టు డైలాగు టీడీపీ వద్ద సిద్ధంగానే ఉంటుందనుకోండి అంటూ సెటైర్లు వేశారు.

అభ్యర్థులే కరవు..
క్షేత్ర స్థాయిలో టీడీపీ బలం ఏంటో రెండు విడదల పంచాయతీ ఎన్నికలతోనే తేలిపోయింది. ఏకగ్రీవాలయితే ఊరుకోను.. కచ్చితంగా మన అభ్యర్థి బరిలో దిగాల్సిందేనంటూ చంద్రబాబు ఆదేశాలివ్వడంతో జిల్లా నాయకులు హడలిపోయారు. అయితే వారికి అభ్యర్థులే దొరకలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఒకరిద్దరు చిక్కినా.. వారి తరపున పంచాయతీలకు ఉన్న పన్ను బకాయిలన్నీ చెల్లించడంతోపాటు, నామినేషన్ ఫీజు కూడా ఇచ్చి, ప్రచార ఖర్చులు కూడా భరించాలనేసరికి స్థానిక టీడీపీ నాయకుల గుండె ఝల్లుమంది. దీంతో చాలామంది వెనక్కి తగ్గారు, అభ్యర్థులు కూడా తమకెందుకులే అని సైలెంట్ గా ఉన్నారు. మొత్తమ్మీద రెండు విడతల పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో వైసీపీ బలం తగ్గలేదనే విషయం తేలిపోగా. వైసీపీ, వైసీపీ మధ్య జరుగుతోన్న పంచాయతీ పోరుకి టీడీపీ నాయకులే ప్రేక్షకులయ్యారు.

First Published:  13 Feb 2021 9:58 PM GMT
Next Story