గ్రామాల్లో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

ఏపీలోని గ్రామ పంచాయతీల పరిధిలో రేషన్ డోర్ డెలివరీపై ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షలను హైకోర్టు సస్పండ్ చేసింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. మార్చి 15 వరకు ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. తదుపరి విచారణ మార్చి 15కు వాయిదా వేసింది.

శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలైన రేషన్ సరకుల డోర్ డెలివరీ.. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 1నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా గ్రామాల్లో దీనిపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వం పట్టుబట్టినా ఎన్నికల కమిషన్ ససేమిరా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోడ్ లేని మున్సిపాల్టీల పరిధిలోనే రేషన్ డోర్ డెలివరీ మొదలైంది. రేషన్ ట్రక్ ల ద్వారా ఇంటింటికీ వెళ్లి రేషన్ సరకులను అందిస్తున్నారు. అదే సమయంలో గ్రామాల్లో మాత్రం ఇంకా ఈనెల రేషన్ పంపిణీ మొదలు కాలేదు. కోర్టులో పిటిషన్ వేసిన ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూసింది. తొలుత ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దీనిపై ఓ నిర్ణయానికి రావాలని, సంప్రదింపులు జరపాలని సూచించింది హైకోర్టు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం సంప్రదింపుల తర్వాత కూడా ససేమిరా అంది. రేషన్ పంపిణీ చేసే వాహనాల రంగులు మార్చాలని, దానిపై ఉన్న సీఎం జగన్, వైఎస్ఆర్ బొమ్మలు తొలగించాలని సూచించింది. అయితే రంగులు మార్చడానికి ఎక్కువ సమయం పడుతుందని, ఈలోగా ఎన్నికల కోడ్ పూర్తవుతుందని, పైగా రంగులు మార్చడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని ప్రభుత్వ అధికారులు ఈసీకి తెలియజేశారు. ఇదే విషయాన్ని హైకోర్టుకి తెలిపారు. దీంతో హైకోర్టు తాజాగా రేషన్ డోర్ డెలివరీపై ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆంక్షలను సస్పెండ్ చేసింది.

హైకోర్టు తాజా ఆదేశాలతో వెంటనే రేషన్ డోర్ డెలివరీకి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాల్లో ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ రేషన్ డోర్ డెలివరీ జరుగుతుంది.

మరోవైపు మున్సిపల్ ఏరియాల్లో మార్చి 10న ఎన్నికలకు కమిషన్ ఆదేశాలిచ్చినా.. రేషన్ డోర్ డెలివరీ యథావిధిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది మార్చి 23న నిర్వహించాల్సిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో.. మార్చి 10న ఎన్నికలు, 14న కౌంటింగ్ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 3 డెడ్ లైన్ గా పెట్టింది.