యువ పర్యావరణ వేత్తకు దేశవ్యాప్త మద్దతు

బెంగళూరుకు చెందిన యువ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త దిశా రవి అరెస్టు ఇప్పుడు దేశ వ్యాప్త చర్చనీయాంశంగా మారింది. దిశ అరెస్టు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన టూల్ కిట్ ను దిశ షేర్ చేయడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమె పోస్టు రైతులను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ ఐపీసీ 124ఏ, 120ఏ, 153ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. కాగా.. దిశా రవి అరెస్టును దేశవ్యాప్తంగా పలువురు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు.

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ దిశా రవి అరెస్టును ఖండించారు. పోలీసులు వేధింపులకు పాల్పడడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఆమెకు తాను అండగా ఉంటానన్నారు. మరో సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం సైతం ఈ యువ పర్యావరణ వేత్త అరెస్టును తప్పుబట్టారు. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా యువత గళం విప్పాలని కోరారు. రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించడం నేరం కాదని, ఆ కారణంగా కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమేంటని ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుల అణచివేతకు ప్రయత్నిస్తోందన్నారు. దిశ అరెస్టును ఖండించిన వారినలో కేంద్ర మాజీ మంత్రి శనిథరూర్,
కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మలూ ఉన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి వారం క్రితం పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ సెలబ్రెటీల నుంచి రైతు ఉద్యమానికి మద్దతు లభించడాన్ని జీర్ణించుకోలేకపోయిన కేంద్ర ప్రభుత్వం వారిపై ప్రతిదాడికి దేశీయ సెలబ్రెటీలను ప్రయోగించింది. ఈ క్రమంలో రైతుల సమస్య గురించి తెలీకుండా వ్యాఖ్యానించొద్దంటూ పలువురు నెటిజన్లు గ్రెటాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో… రైతు ఉద్యమం గురించి తెలుసుకోవాలంటే ఇది చూడండి అంటూ ట్విట్టర్ లో ఒక టూల్ కిట్ ని షేర్ చేసింది.

గ్రెటా షేర్ చేసిన టూల్ ‌కిట్‌ గూగుల్‌ డాక్యుమెంట్ ‌ను దిశా రవి ఎడిట్ చేసిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. రైతు ఉద్యమానికి మద్దతు తెలిపే ఉద్దేశ్యంతో… డాక్యుమెంట్ లో అభ్యంతరకరంగా ఉన్న అంశాలను తొలగించాలంటూ గ్రెటాను కోరానని దిశ తెలిపారు. డాక్యుమెంట్ లోని రెండు లైన్లను ఎడిట్ చేశానని అన్నారు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్ ‌పూర్తిచేసిన దిశ ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌ గా పనిచేస్తూ ‘ఫ్రైడే ఫర్‌ ఫ్యూచర్‌’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. కాగా… దిశా రవిపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, వెంటనే ఆమెను విడుదల చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడుస్తోంది. అటు రైతు నేతలు సైతం దిశ అరెస్టును ఖండించారు. కిసాన్ సంయుక్త మోర్చ దిశపై తప్పుడు కేసులు మోపడాన్ని తప్పబట్టింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.