దిశ రవి ఎవరు? టూల్ కిట్ అంటే ఏంటి?

స్వీడ‌న్‌కు చెందిన ప‌ర్యావ‌ర‌ణ ఉద్యమ‌కారిణి గ్రెటా థ‌న్‌బ‌ర్గ్‌కు రైతుల ఆందోళ‌న‌కు సంబంధించిన టూల్ కిట్ షేర్ చేసిన కేసులో బెంగ‌ళూరుకు చెందిన పర్యావరణ కార్యక‌ర్త దిశ ర‌విని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి ఈ న్యూస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అసలెవరీ దిశ రవి? టూల్ కిట్ అంటే ఏంటి? ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు?

దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనకు గ్రెటా థన్ బర్గ్ మద్దతు తెలుపుతూ ఓ టూల్ కిట్ ను అప్ లోడ్ చేసి, డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టూల్‌కిట్‌ ను రూపొందించిన వారిలో దిశరవి కూడా ఉందని, ఆ టూల్ కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు థన్‌బర్గ్‌‌, దిశలపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు.

ఎవరీ దిశ?
22ఏళ్ల దిశ రవి బెంగళూరు ఐటీ సిటీకి చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త. బెంగ‌ళూరులోని మౌంట్ కామెల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన దిశ “ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌” పేరిట గ్రెటా థ‌న్‌బ‌ర్గ్ ప్రారంభించిన పర్యావరణ పరిరక్షణ కార్యకర్తల గ్రూపులో సభ్యురాలు. 2019లో “ఫ్రైడేస్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ ఇండియా” విభాగాన్ని ఈమె ప్రారంభించింది. ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌పై ప్రచారాలు చేస్తూ ఉంటుంది.

ఎందుకు అరెస్ట్ చేశారు?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులు టూల్ కిట్‌ని రూపొందించినట్లుగా కొంతమంది ఆరోపించారు. ఈ టూల్ కిట్ వెనుక ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ “పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌” హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కేసు విచారణలో భాగంగానే దిశ రవిని అరెస్ట్ చేశారు.

టూల్ కిట్ అంటే ఏంటి?
టూల్ కిట్ అంటే ఓ సోష‌ల్ మీడియా డాక్యుమెంట్‌. ఇది ఓ స‌మ‌స్యతోపాటు దానికోసం చేయాల్సిన ఆచ‌ర‌ణ ప్రణాళిక‌ను వివ‌రిస్తుంది. గ్రెటా థ‌న్‌బ‌ర్గ్ రైతుల సమస్యకు ఇది సొల్యూషన్ గా పనికొస్తుందని.. ఆ టూల్‌కిట్‌ను పోస్ట్ చేస్తూ రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్దతు తెలిపింది. అయితే ఈ టూల్ కిట్‌ వల్లనే ఇండియా బ‌య‌ట కూడా దేశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింద‌ని, అందులో ట్విట‌ర్ కీల‌క పాత్ర పోషించింద‌ని కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ చెప్తోంది.

అందరూ ఏమంటున్నారు?
దిశ ర‌విని పోలీసులు అరెస్ట్ చేయ‌డాన్ని చాలా మంది ఖండిస్తున్నారు. సమస్య గురించి దాని పరిష్కారం గురించి మాత్రమే టూల్ కిట్ ఏర్పాటు చేశారని, దానిపై ఇన్ని కుట్రలు వస్తాయని వాళ్లు ఊహించి ఉండరని, దిశరవి రైతులకు మద్దతు తెలిపే ఉద్దేశంతోనే టూల్ కిట్ ను గ్రెటాకు పంపారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

దిశ ఏమంటున్నారు?
దిశరవిని విచారించే సమయంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు టూల్‌కిట్‌ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే ఎడిట్‌ చేశానని ఆమె అన్నారు. డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం దిశను ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉంచారు.