వైసీపీ ఉత్సాహం.. టీడీపీ మౌనం.. జనసేన హడావిడి..

పంచాయతీ ఎన్నికలు పూర్తి కాకముందే మున్సిపాల్టీ ఎన్నికలకు ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంటో టీడీపీ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఇదే నిమ్మగడ్డ రమేష్.. ప్రభుత్వంతో సంప్రదించకుండా పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నామని ఏకపక్షంగా ప్రకటించిన వేళ చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇదే అవకాశమని, వెంటనే పంచాయతీ ఎన్నికలు జరపాలని, ప్రభుత్వం ఓటమి భయంతో వెనకడుగేస్తోందని స్టేట్ మెంట్లిచ్చారు. కట్ చేస్తే పంచాయతీ పోరు రెండు దశలు పూర్తి కాగానే చంద్రబాబుకి సీన్ అర్థమైంది. దీంతో మున్సిపాల్టీ పోరుపై చంద్రబాబు డైలమాలో పడ్డారు. ఎన్నికల కమిషన్ ప్రకటన వచ్చి గంటలు గడుస్తున్నా టీడీపీ శిబిరం నుంచి స్పందన లేదు. ఈపాటికే జూమ్ లోకి వచ్చి ప్రసంగం మొదలు పెట్టాల్సిన బాబు గొంతు మూగబోయింది, లోకేష్ యథావిధిగా ట్విట్టర్ లోనే ఉన్నారు. మిగతా నాయకులు కూడా మున్సిపాల్టీ ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడేందుకు ఇష్టపడటంలేదు. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మీడియాకి, సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు.

బాబుకి ఓటమి భయం పట్టుకుందా..?
మున్సిపాల్టీ ఎన్నికలకు సంబంధించి ఈపాటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఉపసంహరణలే మిగిలున్నాయి. దానికి కూడా డెడ్ లైన్ ప్రకటించి మార్చి 10న ఎన్నిక, 14న కౌంటింగ్ అని తేల్చి చెప్పింది ఈసీ. పంచాయతీ పోరు జరిగిన తీరు చూస్తే.. మున్సిపాల్టీల్లో కూడా టీడీపీకి పరాభవం తప్పదని తేలిపోయింది. చైర్మన్ పోస్టులపై ఎలాగూ ఆశలేదు, కనీసం వార్డు కౌన్సిలర్, కార్పొరేటర్లుగా కూడా తమ పార్టీ అభ్యర్థులు గెలవరనే భయం పట్టుకోవడంతో అసలు ఆ ఎన్నికల ప్రక్రియపై స్పందించడం మానేశారు చంద్రబాబు.

వైసీపీలో ఉత్సాహం..
పంచాయతీ రెండోదశ పూర్తికాకముందే వైసీపీ శిబిరం.. ఆగిపోయిన పరిషత్, మున్సిపాల్టీ ఎన్నికల గురించి మాట్లాడింది. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధంగానే ఉన్నామని మంత్రులు సైతం తేల్చి చెప్పారు. గతంలో కరోనా సాకుతో ఎన్నికల్ని ఆపాలని అనుకున్న అధికార పక్ష నేతలే.. పంచాయతీ ఫలితాలతో జోష్ లోకి వచ్చేశారు, అదే ఊపులో మున్సిపాల్టీలు చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.

జనసేన హడావిడి..
మున్సిపాల్టీ ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదలు పెడుతున్నట్టు ఈసీ ప్రకటించగానే జనసేన స్పందించడం విశేషం. గతంలో పరిషత్, మున్సిపల్ ఎన్నికలను జనసేన పెద్దగా పట్టించుకోలేదు. జనసేన తరపున నామినేషన్ల హడావిడి కూడా లేదు. తీరా ఇప్పుడు పాత నామినేషన్లతోనే ఎన్నికలు జరుగుతాయని ఈసీ తేల్చి చెప్పడంతో జనసేన తరపున నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఆగినచోటనుంచే తిరిగి ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతామని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది క్రితం ఎన్నికలు నిలిపివేసిన చోట నుంచి మళ్లీ కొనసాగించడం సరికాదని.. కొత్తగా ప్రక్రియ ఆరంభించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని డిమాండ్ చేశారాయన. గతంలో జరిగిన నామినేషన్ల సమయంలో అభ్యర్థులు, ఓటర్లను అధికారపక్షం మభ్యపెట్టిందని ఆరోపించిన నాదెండ్ల మనోహర్, ఆగినచోట నుంచి మళ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం ప్రజాస్వామ్యబద్ధం కాదని విమర్శించారు.