‘ఫేక్’ బుక్.. ఇది కొత్తరకం ఫ్రాడ్ గురూ!

అర్జెంట్ గా కొంత డబ్బు అవసరమైందని ఫ్రెండ్ నుంచి ఫేస్ బుక్ లో మెసేజ్ వస్తుంది. సరే అనే డబ్బు పంపాక తెలుస్తుంది. అడిగింది మన ఫ్రెండ్ కాదని. అదే మరి కొత్త రకం ఫ్రాడ్.. ఫేస్ బుక్ ప్రొఫైల్, ప్రొఫైల్ పిక్చర్, డీటెయిల్స్ అన్నీ మక్కీకి మక్కీ కాపీ కొట్టేస్తారు. అర్జెంట్ గా డబ్బు అవసరమైందని.. వివరాలు తర్వాత చెప్తానని.. ఓ కొత్త నంబర్ పంపి దానికి పేమెంట్ చేయమని అడుగుతారు. అడిగింది మన ఫ్రెండే అనుకుని డబ్బు పంపి మోసపోతాం.. ఇదీ ఇప్పుడు నడుస్తున్న కొత్తరకం సైబర్ క్రైమ్.
ఈ ఫేక్ అకౌంట్లకు వాళ్లు వీళ్లు అని లేదు. సామాన్యుల నుంచి ఐపీఎస్‌ అధికారుల వరకూ అనేక మంది పేర్లతో ఫేస్ బుక్‌ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ కి మెసేజ్ చేసి డబ్బు కాజేసే మోసగాళ్లు తయారయ్యారు. మన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ పిక్స్, ఇతర పోస్ట్ లు ఫొటోలే వీళ్లకు ఆయుధాలు.

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ పేరులో ఒక లెటర్ మార్చి నకిలీ ఖాతా తెరుస్తారు. ప్రొఫైల్ పిక్ అదే పెడతారు. వాళ్ల ఫ్రెండ్స్ లిస్ట్ లో కొంతమందికి రిక్వెస్ట్ పెట్టి యాక్సెప్ట్ చేశాక మెసెంజర్ లో డబ్బు కావాలని మెసేజ్ చేస్తారు. అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. కాబట్టి అది మన ఫ్రెండే అనుకుంటాం. కొత్తగా రిక్వెస్ట్ పెట్టావేంటని అడిగితే సెట్టింగ్స్ ఏవో మారాయని చెప్తాడు. అలా ఫ్రెండ్స్ లిస్ట్ లో కొంతమందిని ఎంచుకుని మరీ ఎక్కువ మొత్తం కాకుండా.. ఓ పది వేలు డబ్బు కావాలని చాలా అర్జెంట్ అని.. వివరాలు తర్వాత చెప్తానని నకిలీ అకౌంట్‌ నుంచి మెసేజ్‌లు పంపిస్తారు.

ఇలా కూడా
ఫేస్ బుక్ ఒక్కటే కాదు వాట్సాప్ ను కూడా వాడేసుకుంటున్నారు. వాట్సాప్ డీపీ సేము టు సేమ్ పెట్టి ఈ నంబర్ నాదే ఇంకో నంబర్ తీసుకున్నానని చెప్తారు. ఒక రెండ్రోజులు అదీ ఇదీ మాట్లాడిన తర్వాత డబ్బు అవసరమైందని మెసేజ్ వస్తుంది. తీరా ఇచ్చాక అడిగింది మన ఫ్రెండ్ కాదని తెలుస్తుంది.

ఏం చేయాలి
ఫేస్‌బుక్‌ లేదా వాట్సాప్‌ నుంచి డబ్బు పంపమని అడిగితే.. ఒకసారి కాల్ చేసి మీ ఫ్రెండ్ తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవాలి. కొత్త నంబర్ కు పే చేయమని అడిగితే ఓ సారి అనుమానించాల్సిందే. ఇకపోతే ఈ ఫ్రాడ్ లో అందరూ ఈజీగా మోసపోయే ప్రమాదముంది కాబట్టి.. విషయాన్ని ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయాలి. నా పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే పంపించవద్దు అని మిగిలిన వాళ్లందరినీ అప్రమత్తం చేయాలి! అలాగే ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ప్రైవసీ సెట్టింగ్స్‌ను కూడా ఫ్రెండ్స్‌కు మాత్రమే మార్చుకోవాలని, గుర్తు తెలియని వ్యక్తుల ఫ్రెండ్‌ రిక్వె్‌స్ట యాక్సెప్ట్‌ మంచిదికాదని సైబర్‌ నిపుణులు చెప్తున్నారు.