కుప్పంలో చంద్రబాబుకు పరాభవం..

“వైసీపీకి ఏకగ్రీవాలు అయితే ఊరుకోను, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే, ఎన్నికల్లో ఓడిపోతే బాధ్యత మీదే”నంటూ ఆమధ్య సొంత పార్టీ నాయకులకు టార్గెట్లు పెట్టి మరీ భయభ్రాంతులకు గురి చేశారు చంద్రబాబు. తీరా ఆయన సొంత నియోజకవర్గంలోనే టీడీపీ పూర్తిగా పడకేసింది. కుప్పం నియోజకవర్గ పరిధిలో మొత్తం 93 పంచాయతీలు ఉండగా 4 ఏకగ్రీవాలు పోగా 89 చోట్ల మూడో దశలో ఎన్నికలు జరిగాయి. 74 చోట్ల వైసీపీ బలపరచిన అభ్యర్థులు సర్పంచ్ లు గా గెలవగా, కేవలం 14సీట్లకి టీడీపీ మద్దతుదారులు పరిమితం అయ్యారు. ఒకచోట ఇండిపెండెంట్ కి అవకాశం దక్కింది. ఇప్పటి వరకూ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ మాదే, వైసీపీ పతనం మొదలైందని చెబుతూ వస్తున్న చంద్రబాబుకి ఇది నిజంగా షాకింగ్ న్యూసే.

కుప్పం ఫలితాలతో వైసీపీ నేతలు బాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు పనైపోయిందని, ఆయన కుప్పం వదిలి పారిపోతారని జోస్యం చెబుతున్నారు. 1989నుంచి చంద్రబాబు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇంత ఘోరమైన ఫలితాలు ఎప్పుడూ రాలేదు. 2013లో వైసీపీకి కేవలం 12 స్థానాలు రాగా.. ఈ దఫా ఏకగ్రీవాలతో కలిపి ఆ స్థానాలు 78కావడాన్ని ఆ పార్టీ ఘన విజయంగానే చెప్పాలి.

కుప్పంలో కుప్పకూలిన టీడీపీ
కుప్పంలో టీడీపీ కుప్పకూలిపోయిందని, చంద్రబాబు కోట బద్ధలై పోయిందని అన్నారు మంత్రి కన్నబాబు. ఈ ఫలితాలు ఈహించినవేనని అన్నారాయన. మంగళగిరిలో కొడుకు ఓడిపోయారని, ఇక కుప్పంలో తండ్రి ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గం మార్చాల్సిన సమయం వచ్చిందని అన్నారు. గతంలో చంద్రగిరి వదిలి కుప్పం వచ్చిన బాబు.. రాబోయే ఎన్నికలకోసం తెలంగాణ అయినా, అండమాన్ అయినా వెళ్లొచ్చని.. వారిది జాతీయ పార్టీ, ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు కదా అని చెణుకులు విసిరారు కన్నబాబు. ఈ ఫలితాలు చూసయినా చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లడం మానుకోవాలని, టీడీపీ పరిస్థితిని సమీక్షించుకోవాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబుకి కుప్పం ఫలితం చెంపపెట్టు అని అన్నారు. కుప్పంలోనే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 900 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 85 శాతం వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారని చెప్పారు కన్నబాబు.

జగన్ పాలనకు రెఫరెండం..
సీఎం జగన్ ప్రజా రంజక పాలనకు నిదర్శనమే పంచాయతీ ఎన్నికల ఫలితాలని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తొలి రెండు విడతల్లో ఆధిక్యం వచ్చినప్పుడే మూడో విడత మరింత పెరుగుతుందని తాను చెప్పానని, అదే జరుగుతోందని అన్నారు బొత్స. సంక్షేమ కార్యక్రమాల అమలుతో సంతోషంగా ఉన్న ప్రజలు.. వైసీపీని బలపరుస్తున్నారని చెప్పారు. కిందపడ్డా పైచేయి తమదేనంటూ బుకాయిస్తున్న చంద్రబాబు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలకోసం ఎదురు చూడాలని చెప్పారు. ఈ ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, మరింత మెరుగ్గా పనిచేస్తామని అన్నారు బొత్స.

టీడీపీ అనుకూల మీడియా ప్రచారం పనిచేయలేదు..
టీడీపీ నాయకులు, వారి అనుకూల మీడియా ద్వారా తొలి రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చాయని, వైసీపీ పనైపోతుందని దుష్ప్రచారం చేశారని, కానీ అవేవీ క్షేత్ర స్థాయిలో పనిచేయలేదని అన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తొలి రెండు విడతల్లో వచ్చిన ఫలితాలను మసిపూసి మారేడుకాయ చేసి మూడో విడతలో లబ్ధిపొందాలని చూశారని, కానీ అది సాధ్యపడలేదని అన్నారు. టీడీపీ అసత్య ప్రచారాలు చేసినా, ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని చెప్పారు ఎమ్మెల్యే విష్ణు.