తిరుపతి ఉప ఎన్నికపై అమిత్​ షా ఫోకస్​ ! జనసేన పరిస్థితి ఏమిటి?

త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం చెప్పుకోదగ్గ స్థానాలు కూడా రాలేదు. ఏ దశలోనూ మాకు ఇన్ని స్థానాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెప్పుకోలేదు. జనసేన పార్టీ వాళ్లు మాత్రం.. అక్కడక్కడా తమ మద్దతుదారులు గెలిచారని చెప్పుకున్నారు. బీజేపీకి మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే తిరుపతి ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్​ పెట్టింది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఎవరు పోటీ చేయాలన్న విషయం కూడా ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. బీజేపీ మాత్రం తిరుపతి బై ఎలక్షన్ ​లో పోటీచేసేది మేమే నంటూ చెప్పుకుంటున్నది.

పవన్​కల్యాణ్​ను ఎలాగోలా ఒప్పించి.. ఈ స్థానంలో మేమే పోటీచేస్తామంటూ బీజేపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే జనసైనికుల వాదన భిన్నంగా ఉంది. తిరుపతి పార్లమెంట్​ పరిధిలో తమకు బలం ఎక్కువుందని.. కాబట్టి మేమే పోటీచేస్తామని జనసేన నేతలు అంటున్నారు. చివరకు పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. ఇదిలా ఉంటే మార్చి 4న కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. తిరుపతి పర్యటనకు వస్తారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు.

మార్చి 5న ఆయన బీజేపీ రాష్ట్ర నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తిరుపతి బై ఎలక్షన్​పైనే ఆయన చర్చించనున్నట్టు సమాచారం. ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న తిరుపతిలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తున్నది. గత పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గతంలో ఇక్కడినుంచి చిరంజీవి పోటీచేసి గెలుపొందారని.. తిరుపతి పరిధిలోని పలు నియోజక‌వర్గాల్లో కాపు సామాజిక ఓట్లు అధికంగా ఉన్నాయని అది కూడా తమకు కలిసి వస్తుందని వాళ్లు అంటున్నారు. అయినప్పటికీ బీజేపీ మాత్రం పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.