Telugu Global
National

మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్న వేళ.. కేరళ, మహారాష్ట్రలో మాత్రం కొత్త కేసుల నమోదు ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో అధికారుల్లో ఆదుర్దా, ఆందోళన కూడా మొదలైంది. లాక్ డౌన్ తోనే దీనికి పరిష్కారం సాధ్యం అంటున్న మహారాష్ట్ర ప్రభుత్వం వీకెండ్ లాక్ డౌన్ కి సిద్ధపడింది. దేశ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత తిరిగి లాక్ డౌన్ అనే పదం మహారాష్ట్రలోనే తొలిసారిగా వినపడుతోంది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 4787 కొత్త […]

మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు..
X

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్న వేళ.. కేరళ, మహారాష్ట్రలో మాత్రం కొత్త కేసుల నమోదు ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో అధికారుల్లో ఆదుర్దా, ఆందోళన కూడా మొదలైంది. లాక్ డౌన్ తోనే దీనికి పరిష్కారం సాధ్యం అంటున్న మహారాష్ట్ర ప్రభుత్వం వీకెండ్ లాక్ డౌన్ కి సిద్ధపడింది. దేశ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత తిరిగి లాక్ డౌన్ అనే పదం మహారాష్ట్రలోనే తొలిసారిగా వినపడుతోంది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 4787 కొత్త కేసులు నమోదయ్యాయి. రెండు నెలల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడంతో ఇదే తొలిసారి. అమరావతి అనే జిల్లాలో నిన్న మొన్నటి వరకు రోజుకి సగటున 50 కేసులు నమోదవుతుండగా.. శుక్రవారం ఏకంగా 230 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో జిల్లా కలెక్టర్ వీకెండ్ లాక్ డౌన్ విధించారు. శనివారం రాత్రి 8గంటలనుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు మెడికల్ షాపులు మినహా, మార్కెట్లు, ఇతర దుకాణాలు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ఇక మిగతా రోజుల్లో కూడా రాత్రి 8గంటలవరకే వ్యాపారాలు జరగాలని తేల్చి చెప్పారు. కేసులు తగ్గుముఖం పట్టే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని చెప్పారాయన.

అమరావతిలోనే కాదు, మహారాష్ట్రలోని మరో మూడు జిల్లాల్లో కూడా వీకెండ్ లాక్ డౌన్ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఇటు కేరళలో కూడా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో అక్కడ అనధికార ఆంక్షలు మొదలయ్యాయి. లాక్ డౌన్ అనే పదం లేకుండా వ్యాపార సముదాయాల ప్రాంతాల్లో జనం గుంపులు గుంపులుగా ఉండకుండా ఆంక్షలు విధించారు అధికారులు. స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ గేమ్స్ కూడా నిషేధించారు.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి..?
తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మరణాల సంఖ్య సున్నాకు చేరుకుంది. అయితే ఇతర రాష్ట్రాలు, అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉన్న హైదరాబాద్ విషయంలో మాత్రం తెలంగాణ ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ని తెరిచేందుకు ప్రభుత్వం సాహసం చేయడంలేదు. ఏపీలో అన్ని తరగతులకు బోధన జరుగుతున్నా.. తెలంగాణలో కేవలం 9, 10 తరగతుల పిల్లలు మాత్రమే స్కూల్స్ కి వెళ్తున్నారు.

బ్రిటన్ టైప్ కరోనా, కొత్తరకం కరోనా, కొవిడ్ స్ట్రెయిన్ అంటూ.. ఆమధ్య కొన్నాళ్లు ఆందోళనకు గురయ్యారు ప్రజలు. అయితే భారత్ కు బ్రిటన్ నుంచి చాలామంది వచ్చినా ఇక్కడ కొత్తరకం కరోనా ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అందరూ కుదుటపడ్డారు. తీరా ఇప్పుడు కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. మహారాష్ట్రలో మొదలైన లాక్ డౌన్.. అక్కడికే పరిమితం కావాలనేది అందరి ఆశ. పరిస్థితులు చేయిదాటితే.. దేశవ్యాప్త లాక్ డౌన్ ని కొట్టిపారేయలేం.

First Published:  18 Feb 2021 11:54 PM GMT
Next Story