2022 నాటికల్లా పోల‌వ‌రం పూర్తి – డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ చైర్మన్ స్పష్టం..

పోలవరం పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని, 2022నాటికి డ్యాం నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు డిజైన్ రివ్యూ కమిటీ చైర్మన్ ఏబీ పాండ్య. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్ర‌శేఖ‌ర్ అయ్య‌ర్, ఇత‌ర స‌భ్యుల‌తో క‌లిసి శుక్రవారం పరిశీలించిన పాండ్యా.. ఈరోజు అధికారులతో రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో పోలవరం ప్రాజెక్టు అధారిటీ సిఈఓ చంద్రశేఖర్ అయ్యర్, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి , పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈ నరసింహ మూర్తి, పోలవరం నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ తరపున సంస్థ డైరెక్టర్ సిహెచ్ సుబ్బయ్య, జనరల్ మేనేజర్ సతీష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన ఏబీ పాండ్య.. పోలవరం నిర్మాణం 2022నాటికి పూర్తవుతుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్లుకు గాన 29 గేట్ల అమరిక పూర్తయిందని, మిగిలిన గేట్లు అమరికపై అధికారులకు పలు సూచనలు చేశామ‌ని చెప్పారు. పోల‌వ‌రం గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవిగా పేర్కొన్నారు. గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు, పవర్ ప్యాక్ లు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయని పాండ్య తెలిపారు.

పోలవరంలో 52 మీటర్ల ఎత్తున స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. స్పిల్ వే బ్రిడ్జి 1128 మీటర్లుకు గాను 1105 మీటర్ల మేర పని పూర్తయిందని తెలిపారు. పోల‌వ‌రం స్పిల్ వే నిర్మాణంలో కీల‌క‌మైన 192 గ‌డ్డర్లు అమరిక నేటితో పూర్తయిందని అధికారులు వివరించారు. వరదల‌ సమయంలో కోతకు గురైన ఎడమ గట్టు పరిరక్షణ విష‌యం కూడా ఈరోజు జరిగిన సమీక్షలో చర్చకు వచ్చింది. గేట్ల బిగింపు, అమ‌రిక‌పై అధికారులు, మేఘా సంస్థ‌కు పలు సూచ‌న‌లు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.