విజ‌య‌సాయి పాద‌యాత్ర‌తో టీడీపీలో క‌ల‌వ‌రం

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన పక్షం రోజుల తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోవాలనే చిత్తశుద్ధితో ఈ లేఖ రాశారా? లేక అధికార పార్టీ నేతల ఒత్తిడి తట్టుకోలేక మమ అనిపించారా అనేది మాత్రం ఆయనకే తెలియాలి. అటు విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్రకు అనూహ్య స్పందన రావడంతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు.. వెంటనే ప్రధాని మోదీకి లేఖరాసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు లేఖలో కొత్త విషయం ఏదీ లేకపోగా.. గతంలో సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలనే తన లేఖలో కూడా పొందుపరిచారు. సొంత గనులు లేకపోవడం, రుణభారం ఎక్కువ కావడంతో విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లిపోయిందని చెప్పిన బాబు.. సొంత గనుల్ని కేటాయించాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆపేసి, ప్రత్యామ్నాయాలు చూడాలని ప్రధానిని కోరారు.

భవిష్యత్తుకంటే చరిత్రకే ప్రాధాన్యం..
విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అని మొదలు పెట్టి 32మంది బలిదానం, ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామా… ఇలా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన పోరాటాన్నంతా తన లేఖలో వివరించారు చంద్రబాబు. చరిత్ర చెప్పడానికే ఎక్కువ స్పేస్ తీసుకున్న బాబు.. పాత మిత్రుడు మోదీని పల్లెత్తు మాట అనలేదు. ప్రైవేటీకకరణను తీవ్రంగా వ్యతిరేకించలేదు, కేవలం ప్రత్యామ్నాయా మార్గాలు మాత్రమే చూడాలని అభ్యర్థించారు. ‘మీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉక్కును వ్యూహాత్మక రంగంగా గుర్తించింది, దేశంలోని పెద్ద ఉక్కు పరిశ్రమల్లో విశాఖ ఉక్కు ఒకటి. సముద్రతీరంలో ఉన్న ఏకైక ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయొద్దు’ అంటూ పనిలో పనిగా మోదీని ఆకాశానికెత్తేశారు చంద్రబాబు.

పాదయాత్రతో టీడీపీలో కలవరం..
విపత్తులను అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ శ్రేణులకు ఉపదేశాలిచ్చే చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్ విపత్తుని కూడా తనకి అనుకూలంగా మలచుకోవాలని చూశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించాలనుకున్నారు. తొలినుంచీ సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. గంటా రాజీనామాకి, టీడీపీ నేతలు చేసిన నిరాహార దీక్షకు అనుకున్నంత స్పందన రాకపోవడంతో కాస్త డీలా పడ్డారు. ఇటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన పాదయాత్రకు ఊహించని స్పందన రావడంతో ఇరుకున పడ్డారు. దీంతో లేఖ రాసి హడావిడి చేశారు చంద్రబాబు. మొత్తమ్మీద విజయసాయి పాదయాత్రతో టీడీపీలో కలవరం మొదలైందని అంటున్నాయి వైసీపీ శ్రేణులు.