ప్రొఫెసర్​ నాగేశ్వర్​కు టీఆర్​ఎస్​ మద్దతు?

ప్రస్తుతం తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్​, పాలమూరు, రంగారెడ్డితోపాటు నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్​, వరంగల్​ ఎన్నికలకు నోటిఫికేషన్​ వచ్చేసింది. అయితే వరంగల్​ బరిలో టీఆర్​ఎస్​ నుంచి పల్లా రాజేశ్వర్​రెడ్డి పోటీచేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే హైదరాబాద్​ బరిలో టీఆర్​ఎస్​ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు నామినేషన్ల గడువు సమీపిస్తున్నది. అయినప్పటికీ టీఆర్​ఎస్​ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఇక్కడ టీఆర్​ఎస్ అభ్యర్థిని బరిలో దించడం లేదని సమాచారం. సీపీఎం తరఫున బరిలో ఉన్న ఎమ్మెల్సీ నాగేశ్వర్​కే టీఆర్​ఎస్​ మద్దతు ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గతంలో ఈ స్థానం నుంచి టీఆర్​ఎస్​ గెలిచిన చరిత్ర లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు బరిలో దిగారు. అప్పుడు ఉద్యోగం సంఘం నేత దేవీప్రసాద్​ను పోటీపెట్టినప్పటికీ టీఆర్​ఎస్​ గెలవలేదు. దీంతో ఇప్పుడు ఈస్థానం నుంచి పోటీచేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదట.

జీహెచ్​ఎంసీ మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ ఇక్కడ పోటీచేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అందుకు రామ్మోహన్​ ఒప్పుకోలేదట. దీంతో కేసీఆర్​ మరికొందరు నేతలను సంప్రదించారు. అయితే ఇక్కడ పోటీచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కాంగ్రెస్​ నుంచి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి.. బీజేపీ నుంచి సిట్టింగ్​ ఎమ్మెల్సీ రామచంద్రరావు బరిలో నిలిచారు.

అయితే సీపీఎం తరపున పోటీచేస్తున్న ప్రొఫెసర్​ నాగేశ్వర్​కు ఇక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఆయన గతంలో ఇక్కడ ఎమ్మెల్సీగా గెలుపొందారు. అంతేకాక కేసీఆర్​ చేసిన అంతర్గత సర్వేలోనూ ఈ విషయమే వెల్లడైందట. దీంతో అభ్యర్థిని పోటీకి పెట్టకుండా నాగేశ్వర్​కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్​ భావిస్తున్నట్టు సమాచారం.