Telugu Global
NEWS

ఏప్రిల్ 14నుంచి తిరుమలలో ఆర్జిత సేవలు.. కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి..

కరోనా కారణంగా వాయిదా పడిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను ఏప్రిల్ 14న ఉగాది సందర్భంగా పునఃప్రారంభించబోతున్నట్టు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 2021-22 సంవత్సరానికి గాను రూ.2937.82కోట్లతో టీటీడీ బడ్జెట్ ను పాలకమండలి ఆమోదించింది. ఈ సందర్భంగా పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వెల్లడించారు. ఆర్జిత సేవల ప్రారంభం దృష్ట్యా.. టీటీడీ సిబ్బందికి కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా […]

ఏప్రిల్ 14నుంచి తిరుమలలో ఆర్జిత సేవలు.. కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి..
X

కరోనా కారణంగా వాయిదా పడిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను ఏప్రిల్ 14న ఉగాది సందర్భంగా పునఃప్రారంభించబోతున్నట్టు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 2021-22 సంవత్సరానికి గాను రూ.2937.82కోట్లతో టీటీడీ బడ్జెట్ ను పాలకమండలి ఆమోదించింది. ఈ సందర్భంగా పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వెల్లడించారు. ఆర్జిత సేవల ప్రారంభం దృష్ట్యా.. టీటీడీ సిబ్బందికి కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సేవకు వచ్చే మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ సమర్పించాలని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.

త్వరలో ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తామన్నారు. అలిపిరి మెట్ల మార్గంలో అమలు చేస్తున్నట్టే, శ్రీవారి మెట్టు మార్గంలో నడచి వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్ టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం కానీ, భజన మందిరం కానీ, యాత్రికుల సముదాయం కానీ నిర్మిస్తామని అన్నారు.

గుడికో గోమాత కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా విస్తృత స్పందన వస్తోందని చెప్పిన టీటీడీ చైర్మన్, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని పాలకమండలిలో తీర్మానం చేసినట్టు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా తులాభారం ప్రవేశ పెట్టబోతున్నట్టు తెలిపారు. టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకొని వచ్చి, ఆయా ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ నుండి ఆర్థిక సహాయం చేస్తామన్నారు. టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణం, లీజుకు ఇవ్వడం, నిర్వహణకు సంబంధించి అన్నిప్రాంతాలకు ఒకే మార్గదర్శకాలు రూపొందించబోతున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఉన్న కళ్యాణమండపాలు సక్రమంగా నిర్వహించి నష్టాలు తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం గా మార్చేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో చిన్న పిల్లల ఆస్పత్రికోసం రూ 9 కోట్ల మంజూరుకు ఆమోదించారు. విస్తరణ పనులకు రూ.3.75 కోట్లతో టెండర్లను ఆమోదించారు. టీటీడీలో నెయ్యి ట్యాంకుల సామర్థ్యాన్ని 180.4 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ఆమోదించారు. దీని ద్వారా నెయ్యి నిల్వలను 6 రోజుల నుంచి 14 రోజులకు పెంచుకోవచ్చు. తిరుమలలో 50మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి, వసతి గృహాలు, సత్రాలకు విద్యుత్ మీటర్లు బిగించాలనే నిర్ణయం పాలకమండలి తీసుకుంది. బడ్జెట్ ఆమోదంతోపాటు.. ఆర్జిత సేవల పునఃప్రారంభం వంటి కీలక నిర్ణయాలు ఈ దఫా పాలకమండలి తీసుకుంది.

First Published:  27 Feb 2021 11:03 AM GMT
Next Story