Telugu Global
NEWS

ఇన్నాళ్లకు పవన్ ట్రాక్ లో పడ్డారా..?

పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జనసైనికులతోపాటు, జనసేనానిలోకూడా జోష్ కనపడుతోంది. అది అతి విశ్వాసమా, ఆత్మ విశ్వాసమా లేక అల్ప సంతోషమా తెలియదు కానీ.. మొత్తానికి పవన్ అసలు సిసలు రాజకీయం మొదలు పెడుతున్న‌ట్టున్నారు. ఇన్నాళ్లూ లాబీయింగ్ రాజకీయాల్ని నమ్ముకుని ఢిల్లీ టూర్లు, మేథో మథనాలు, కోర్ కమిటీ చర్చలు అంటూ పేపర్ వర్క్ పాలిటిక్స్ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడిప్పుడే కార్యక్షేత్రంలో దిగుతున్నట్టు అర్థమవుతోంది. పవన్ సూచనలతో అటు నాదెండ్ల మనోహర్ కూడా నేరుగా పార్టీ శ్రేణులను […]

ఇన్నాళ్లకు పవన్ ట్రాక్ లో పడ్డారా..?
X

పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జనసైనికులతోపాటు, జనసేనానిలోకూడా జోష్ కనపడుతోంది. అది అతి విశ్వాసమా, ఆత్మ విశ్వాసమా లేక అల్ప సంతోషమా తెలియదు కానీ.. మొత్తానికి పవన్ అసలు సిసలు రాజకీయం మొదలు పెడుతున్న‌ట్టున్నారు. ఇన్నాళ్లూ లాబీయింగ్ రాజకీయాల్ని నమ్ముకుని ఢిల్లీ టూర్లు, మేథో మథనాలు, కోర్ కమిటీ చర్చలు అంటూ పేపర్ వర్క్ పాలిటిక్స్ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడిప్పుడే కార్యక్షేత్రంలో దిగుతున్నట్టు అర్థమవుతోంది. పవన్ సూచనలతో అటు నాదెండ్ల మనోహర్ కూడా నేరుగా పార్టీ శ్రేణులను కలుసుకుంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో ఫెయిలైనా వెంటనే తేరుకుని, పంచాయతీ ఎన్నికలతో రాజకీయం మొదలు పెట్టారు పవన్.

మిత్రపక్షంపై అతిగా ఆధారపడటంలేదు..
ఇన్నాళ్లూ పవన్ ఏ పని చేయాలన్నా.. మిత్రపక్షం అనుమతి కావాలని అనుకునేవారు. నేరుగా రంగంలోకి దిగాలనుకున్నా కూడా బీజేపీతో మంతనాలు సాగించేవారు. కానీ ఇప్పుడు పవన్ లో బీజేపీ భ్రమలు తొలగిపోయాయి. కాషాయదళం అండలేకుండానే పంచాయతీల్లో కాస్తో కూస్తో సీట్లు గెలుచుకోవడంతో జనసైనికుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. అదే జోష్ తో అటు మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూడా సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు జనసైనికులు. మున్సిపల్ ఎన్నికలకోసం విశాఖలో పర్యటించబోతున్నారు పవన్ కల్యాణ్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా కూడా అప్పుడే అభ్యర్థిని ప్రకటించారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు పెడుతూ, వారి సమస్యలని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించ‌డం మొదలు పెట్టారు పవన్ కల్యాణ్. భీమవరం ఎమ్మెల్యేతో జరుగుతున్న డైరెక్ట్ ఫైట్ కూడా జనసేన ఉనికిని ప్రబలంగా చాటుతోంది.

తిరుపతి సీటు జనసేనకేనా..?
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సహా.. ఇటీవల కాలంలో కేంద్రంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తితో తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి బీజేపీ వెనక్కు తగ్గుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. జనసేన నేరుగా తిరుపతి బరిలో దిగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా లేదా అనడానికి తిరుపతి ఎన్నికల ఓ లిట్మస్ టెస్ట్ లా నిలుస్తుంది.

మొత్తమ్మీద జనసేన రాజకీయ కార్యకలాపాలలో ఇటీవలకాలంలో వచ్చిన మార్పు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఓట్లు, సీట్లు పెరగకపోయినా జనసేనలో వచ్చిన ఈ మార్పు స్థిరంగా ఉంటే.. వచ్చే ఎన్నికలనాటికి కచ్చితంగా ఆ ప్రభావం కనపడుతుందనడంలో అనుమానం లేదు. ఆ ప్రభావం వైసీపీపై ఉంటుందా, టీడీపీ ఓటుబ్యాంకుని ఖాళీ చేస్తుందా, బీజేపీకి లాభపడుతుందా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది.

First Published:  28 Feb 2021 8:47 PM GMT
Next Story