Telugu Global
NEWS

వలంటీర్ల జోలికి వెళ్లొద్దు.. కొత్త నామినేషన్లు కుదరవు..

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు వలంటీర్లను దూరంగా పెట్టాలని, వారి సెల్ ఫోన్లు సైతం తీసేసుకోవాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. వలంటీర్ల విధులకు భంగం కలిగించొద్దని, వారి వద్దనుంచి సెల్ ఫోన్లు కూడా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను సవాలు‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ తీర్పు వెలువడింది. మాజీ ఎమ్మెల్యే […]

వలంటీర్ల జోలికి వెళ్లొద్దు.. కొత్త నామినేషన్లు కుదరవు..
X

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు వలంటీర్లను దూరంగా పెట్టాలని, వారి సెల్ ఫోన్లు సైతం తీసేసుకోవాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. వలంటీర్ల విధులకు భంగం కలిగించొద్దని, వారి వద్దనుంచి సెల్ ఫోన్లు కూడా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను సవాలు‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ తీర్పు వెలువడింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా ఇదే విషయమై వలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలంటూ కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ మూడింటిపై మంగళవారం వాదనలు విన్న హైకోర్టు.. ఈరోజు తీర్పు వెల్లడించింది. వలంటీర్ల జోలికి వెళ్లొద్దని, వారి విధులకు భంగం కలిగించొద్దని, సెల్ ఫోన్లు తీసేసుకోవద్దని తెలిపింది.

ఆ నామినేషన్లు చెల్లవు..
రాష్ట్రవ్యాప్తంగా 11చోట్ల రీ నామినేషన్లకు ఎస్ఈసీ ఇచ్చిన అనుమతిని కూడా హైకోర్టు కొట్టివేసింది. వైరి పక్షాల బెదిరింపుల వల్లే తాము నామినేషన్లు వేయలేకపోయామని, ఒత్తిడి చేయడం వల్లే కొన్నిచోట్ల నామినేషన్లు ఉపసంహరించుకున్నామనే కొంతమంది ఈసీకి ఫిర్యాదు చేయడంతో 11చోట్ల రీ నామినేషన్లకు ఉత్తర్వులిచ్చారు నిమ్మగడ్డ. తిరుపతి, పుంగనూరు, రాయచోటిలో.. ఎస్ఈసీ ఆదేశాలమేరకు మొత్తం నలుగురు కొత్తగా నామినేషన్లు వేశారు. అయితే అప్పటికే అక్కడ నామినేషన్లు వేసిన అభ్యర్థులు.. కొత్త నామినేషన్ల వ్యవహారంపై కోర్టుకెక్కారు. దీంతో కోర్టు ఆ నామినేషన్లు చెల్లవని తేల్చి చెప్పింది. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసింది. ఒకేరోజు రెండు విషయాల్లో ఎస్ఈసీ నిర్ణయాలను హైకోర్టు నిలుపుదల చేయడం విశేషం.

First Published:  3 March 2021 8:16 AM GMT
Next Story