Telugu Global
National

తమిళనాట బీజేపీ పాచిక పారింది..

ఉత్తరాదితోపాటు.. మెల్ల మెల్లగా దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తోంది బీజేపీ. అదనుకోసం చాన్నాళ్లుగా వేచి చూస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో ఆ పార్టీకి ఇంకా ఎంట్రీ దక్కలేదు. అయితే ఇద్దరు హేమా హేమీలు లేని 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. వాస్తవానికి బీజేపీకి తమిళనాడులో అధికారం చేజిక్కించుకోవాలన్న భారీ ఆశలేవీ లేవు. ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే ఉన్న అధికారాన్ని బయటకు లాక్కురావాలి, ఒకవేళ అధికారం ప్రాంతీయ పార్టీలదే అయినా.. వారి జుట్టు మాత్రం తమ […]

తమిళనాట బీజేపీ పాచిక పారింది..
X

ఉత్తరాదితోపాటు.. మెల్ల మెల్లగా దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తోంది బీజేపీ. అదనుకోసం చాన్నాళ్లుగా వేచి చూస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో ఆ పార్టీకి ఇంకా ఎంట్రీ దక్కలేదు. అయితే ఇద్దరు హేమా హేమీలు లేని 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. వాస్తవానికి బీజేపీకి తమిళనాడులో అధికారం చేజిక్కించుకోవాలన్న భారీ ఆశలేవీ లేవు. ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే ఉన్న అధికారాన్ని బయటకు లాక్కురావాలి, ఒకవేళ అధికారం ప్రాంతీయ పార్టీలదే అయినా.. వారి జుట్టు మాత్రం తమ చేతిలోనే ఉండాలి. ఇదీ బీజేపీ లెక్క. దానికి తగ్గట్టే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. జయలలితే ఉండి ఉంటే.. బీజేపీ ఆటలు ఈస్థాయిలో సాగేవి కావు, తలైవి లేకపోవడంతో ఇప్పుడు అన్నాడీఎంకే కోటలో బీజేపీ ఆడిందే ఆట, పాడిందే పాట. పన్నీర్ అయినా, పళని అయినా అమిత్ షా మాట వినాల్సిందే. ఎదురెళ్లాలని చూస్తే శశికళకు పట్టినగతే పడుతుందనే అనుమానం ఆ ఇద్దరిలో బలంగా ఉంది. అందుకే సీట్ల పంపకాల్లో బీజేపీకి దాసోహం అయ్యారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో బీజేపీ 20 స్థానాల్లో బరిలో ఉంది. కూటమిలో మిగతా వారికి సీట్లు సర్దుబాటు చేయగా చివరకు అన్నాడీఎంకేకు మిగిలినవి 170 స్థానాలు. 234 అసెంబ్లీ సీట్లలో అధికార పార్టీ కేవలం 170 స్థానాల్లో పోటీకి పరిమితం అయిందంటే దాని వెనక ఏదో గూడు పుఠానీ జరిగిందనే అర్థం. అన్నాడీఎంకేని అక్కడికే పరిమితం చేసిన బీజేపీ తమిళనాడులో తొలి విజయాన్ని సాధించింది.

అటు డీఎంకేది కూడా అదే పరిస్థితి. 2016లోనే పొత్తులతో డీఎంకే చిత్తయింది కేవలం 178 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. అయితే ఈ సారి మాత్రం స్టాలిన్ మరీ అంత ఉదారంగా లేరు. గతంలో కాంగ్రెస్ కి 41 స్థానాలు వదిలేసిన స్టాలిన్ ఈసారి కేవలం 24 సీట్లిచ్చి సర్దుకుపోవాలని చెప్పేశారు. సీపీఐకి ఆరంటే ఆరు సీట్లు మాత్రమే కేటాయించింది డీఎంకే.

పొత్తు వ్యూహాలతో ప్రధాన పార్టీలు పోటీ చేసే సీట్లు కుదించుకుపోతున్నాయంటే దానర్థం అక్కడ హంగ్ కి దారులు పడినట్టే లెక్క. రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు ఏర్పడితే.. కేంద్రంలోని బీజేపీ ఏం చేస్తుందో, ఏం చేయగలదో అందరికీ తెలుసు. కర్నాటక అయినా, తమిళనాడు అయినా.. బీజేపీకి ఒకటే. అన్నాడీఎంకేని 170సీట్లకు పరిమితం చేయడంతోనే బీజేపీ తొలి విజయం సాధించింది. ఇక తాను పోటీ చేసే 20 స్థానాల్లో మిగతా పార్టీల మద్దతుతో గట్టెక్కి, అధికార పక్షంలో కీలక భాగస్వామి కావాలనేది కమలనాథుల ఆలోచన. ఓట్లు చీలిపోకుండా ఈపాటికే చిన్నమ్మ శశికళకు రాజకీయ సన్యాసం ఇచ్చేశారు. ఇక మిగిలింది అన్నాడీఎంకేలో లుకలుకలను వాడుకుని తమ హవా పెంచుకోవడం. ఆ లెక్కలన్నీ అమిత్ షా కి బాగా తెలుసు. అన్నాడీఎంకే పరిధి తగ్గించడంతో.. తమిళనాడులో ఎన్నికలకు ముందే బీజేపీ పాచిక పారిందని మాత్రం చెప్పక తప్పదు.

First Published:  8 March 2021 9:50 PM GMT
Next Story