Telugu Global
NEWS

గురుమూర్తి పేరు ఖరారు.. వైసీపీ టార్గెట్ 3 లక్షలు..

తిరుపతి లోక్ సభ స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన వేళ, ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా వైసీపీ ఖరారు చేసింది. గతంలోనే సీఎం జగన్, గురుమూర్తిని తమ అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో 3లక్షల మెజార్టీ సాధించబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంతో వైసీపీ తిరుపతి ఎన్నికను మరింత ధీమాగా ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 2,28,376 ఓట్లు వైసీపీకి మెజార్టీ. […]

గురుమూర్తి పేరు ఖరారు.. వైసీపీ టార్గెట్ 3 లక్షలు..
X

తిరుపతి లోక్ సభ స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన వేళ, ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా వైసీపీ ఖరారు చేసింది. గతంలోనే సీఎం జగన్, గురుమూర్తిని తమ అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో 3లక్షల మెజార్టీ సాధించబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంతో వైసీపీ తిరుపతి ఎన్నికను మరింత ధీమాగా ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 2,28,376 ఓట్లు వైసీపీకి మెజార్టీ. ఈ దఫా.. అంతకంటే ఎక్కువ ఓట్లు వస్తాయని అంచనా.

టీడీపీ పరిస్థితి ఏంటి..?
మున్సిపల్ ఎన్నికల్లో పరాభవ భారంతో ఉన్న టీడీపీ.. తిరుపతి ఉప ఎన్నిక వేళ అంత ఉత్సాహంగా కనిపించడంలేదు. పనబాక లక్ష్మిపేరుని ఖరారు చేసిన సమయంలో కూడా చంద్రబాబు హడావిడే తప్పితే, అసలు అభ్యర్థినుంచి అలాంటి స్పందనా లేకపోవడం విచిత్రం. స్థానికంగా జరిగిన ఏ సమావేశానికీ ఆమె హాజరు కాలేదు. ఆఖరికి తిరుపతిలో పార్టీ ఆఫీస్ ని కూడా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెళ్లి ప్రారంభించారు. తిరుపతి సహా, వెంకటగిరి లాంటి మున్సిపాల్టీల్లో కనీసం ఒక్క వార్డు కూడా గెలుచుకోలేకపోవడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ. ప్రస్తుతం తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మున్సిపాల్టీల్లోనూ వారిదే ఆధిక్యం. దీంతో సహజంగానే టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. మరో నెలరోజులు మాత్రమే సమయం ఉన్న దశలో టీడీపీ పుంజుకుంటుందని, గట్టి పోటీ ఇస్తుందని భావించడం కూడా అత్యాశే అవుతుంది.

బీజేపీ అభ్యర్థి ఎవరు..?
జనసేనను కాదని బీజేపీ అభ్యర్థి తిరుపతినుంచి బరిలో దిగబోతున్నారు. అయితే అభ్యర్థిపై ఇంకా ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. స్థానిక ఎన్నికల్లో ఉనికే లేకపోవడం, పెరుగుతున్న ధరలతో దేశవ్యాప్త వ్యతిరేకత, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రభావం.. ఇలాంటి వాటితో బీజేపీ ఇబ్బంది పడుతోంది. జనసేనతో విభేదాలు మొదలు కావడం కూడా బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ అవుతుందని అంచనా. మున్సిపల్ ఎన్నికల్లో పరోక్షంగా టీడీపీతో కలసి పనిచేశాయి జనసేన శ్రేణులు, అటు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైరి పక్షం టీఆర్ఎస్ కి మద్దతిచ్చాయి. ఈ దశలో జన‌సేన మనస్ఫూర్తిగా బీజేపీతో కలసి పనిచేస్తుందనేది అనుమానమే.

కాంగ్రెస్, వామపక్షాలు.. వగైరా వగైరా.. తిరుపతిలో ఏమాత్రం ప్రభావం చూపలేవని ఇదివరకే తేలిపోయింది. రాగా పోగా.. విశాఖ ఉక్కు జేఏసీ పేరుతో ఓ అభ్యర్థిని నిలబెడతామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇదివరకే ప్రకటించారు. ఒకవేళ అదే సాధ్యమయితే.. బీజేపీకి వచ్చే ఓటు షేర్ మరింత తగ్గుతుందే కానీ, వైసీపీ మెజార్టీపై ప్రభావం మాత్రం ఉండదని విశ్లేషకుల అభిప్రాయం.

First Published:  16 March 2021 8:45 PM GMT
Next Story