Telugu Global
NEWS

తిరుపతిలో పోలింగ్ శాతం పెరిగేనా..? తగ్గేనా..?

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి 4లక్షల మెజార్టీ వస్తుందని, అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చినా ఆశ్చర్యం లేదని మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సారి వైసీపీ ఆశిస్తున్న మెజార్టీని పోలింగ్ శాతం ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సహజంగా ఉప ఎన్నికలపై ప్రజలకు పెద్దగా ఆసక్తి ఉండదు, అందులోనూ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ క్లీన్ విక్టరీ రుజువైన తర్వాత వైరిపక్షాల ఓటర్లు పోలింగ్ కి మరీ అంత ఉత్సాహం చూపించకపోవచ్చనే […]

తిరుపతిలో పోలింగ్ శాతం పెరిగేనా..? తగ్గేనా..?
X

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి 4లక్షల మెజార్టీ వస్తుందని, అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చినా ఆశ్చర్యం లేదని మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సారి వైసీపీ ఆశిస్తున్న మెజార్టీని పోలింగ్ శాతం ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సహజంగా ఉప ఎన్నికలపై ప్రజలకు పెద్దగా ఆసక్తి ఉండదు, అందులోనూ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ క్లీన్ విక్టరీ రుజువైన తర్వాత వైరిపక్షాల ఓటర్లు పోలింగ్ కి మరీ అంత ఉత్సాహం చూపించకపోవచ్చనే అనుమానం కూడా ఉంది. వీటిని పక్కనపెడితే కరోనా సెకండ్ వేవ్ భయం, రోజు రోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు పోలింగ్ పై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. మార్చి నెలాఖరునుంచే సూర్యుడి ప్రతాపం చూస్తున్నాం. ఏప్రిల్ నెల మధ్యలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా పెరుగుతాయని, 50డిగ్రీలను దాటినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. మండుటెండల్లో ప్రచారానికి అభ్యర్థులే ఆపసోపాలు పడుతున్న వేళ, ఓటర్లు పోలింగ్ కేంద్రం వరకు వస్తారని నమ్మకంగా చెప్పలేం. అంటే ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలకు, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు పోలిక పెట్టలేం.

తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 15లక్షల 70వేలు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావుకి వచ్చిన ఓట్లు 7,22,877. అంటే పోలైన ఓట్లలో దాదాపు 55శాతం విజేతకు పడ్డాయి. సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి పడిన ఓట్లు 4,94,501. టీడీపీ ఓటింగ్ శాతం 37.65. ఇక ఇప్పుడు కలసికట్టుగా పోటీ చేస్తున్న బీజేపీ, జనసేన అప్పట్లో నోటాను కూడా దాటలేదు. కాంగ్రెస్ ని లెక్కలో వేసుకోవడం కూడా కష్టమే. వైసీపీకి వచ్చిన మెజార్టీ 2,28,376. లోక్ సభ పరిధిలో 79శాతం పోలింగ్ జరిగింది. అంటే సాధారణం కంటే కాస్త ఎక్కువేనని చెప్పాలి.

అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. పరిషత్ ఎన్నికల్లో పలాయనం చిత్తగించిన టీడీపీ, తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం పోటీలో నిలబడి ఓటు వేయండి అంటోంది. ఈ దఫా ఓటర్లు టీడీపీని ఎంతవరకు నమ్ముతారో తేలాల్సి ఉంది. అటు బీజేపీ, జనసేన కొత్త ఉత్సాహంతో తమ సత్తా చూపిస్తామంటున్నాయి. ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయం తామేనంటున్నారు ఆ పార్టీల నేతలు. ఈ దఫా వైసీపీ తరపున బరిలో నిలిచిన గురుమూర్తి, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఇద్దరూ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. రత్నప్రభ ప్రచారంలో హుషారుగానే కనపడుతున్నారు. ఇటు గురుమూర్తి ప్రచార భారం అంతా మంత్రులు, ఎమ్మెల్యేలే మోస్తున్నారు. ఈపాటికే నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. ఆమేరకు ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ప్రచారం జోరుగా ఉన్నా.. ఓటర్లను పోలింగ్ బూత్ ల వరకు తీసుకు రావడం మాత్రం చోటా నేతలకు కత్తిమీద సామే. స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటూ విలువైనదే కాబట్టి.. అభ్యర్థులు దగ్గరుండి మరీ ఓటర్లను బూత్ లకు తరలిస్తుంటారు. ఎంపీ ఎన్నిక, అందులోనూ ఉప ఎన్నిక, వైసీపీకే మొగ్గు ఉందని దాదాపుగా తేలిపోయిన ఎన్నిక. వీటికోసం ఓటర్లు పోలింగ్ బూత్ ముందు క్యూ కడతారా అంటే అనుమానమే. ఓవైపు కరోనా సెకండ్ వేవ్, మరోవైపు మండే ఎండలు.. ఈ టైమ్ లో గతంలో జరిగిన 79శాతం పోలింగ్ ఈ సారి రిపీట్ అవుతుందని అనుకోలేం. తిరుపతి ఉప ఎన్నికల్లో 60శాతం మించి పోలింగ్ జరిగితే అదే గొప్ప అంటున్నారు. పోలింగ్ శాతంపైనే వైసీపీ మెజార్టీ ఆధారపడి ఉంటుంది.

First Published:  4 April 2021 4:20 AM GMT
Next Story