Telugu Global
National

భారత్ లో నకిలీ టీకాలు.. ఎంపీలు కూడా బుట్టలో పడుతున్నారు..

ఆమధ్య హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొన్ని కంపెనీలు నకిలీ టీకాలతో మోసపోయాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు ఆస్పత్రుల తరపున కొన్ని మెడికల్ ఏజెన్సీలు, సినిమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని, వారి సిబ్బందికి టీకాలు వేశాయి. కానీ టీకాలు తీసుకున్నవారెవరికీ మెసేజ్ లు రాకపోవడం, కనీసం సదరు ఏజెన్సీ కూడా టీకాల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఆయా కంపెనీలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ ఘరానా మోసం వెలుగు చూసింది. ఇలాగే కొన్ని అపార్ట్ మెంట్ల […]

భారత్ లో నకిలీ టీకాలు.. ఎంపీలు కూడా బుట్టలో పడుతున్నారు..
X

ఆమధ్య హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొన్ని కంపెనీలు నకిలీ టీకాలతో మోసపోయాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు ఆస్పత్రుల తరపున కొన్ని మెడికల్ ఏజెన్సీలు, సినిమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని, వారి సిబ్బందికి టీకాలు వేశాయి. కానీ టీకాలు తీసుకున్నవారెవరికీ మెసేజ్ లు రాకపోవడం, కనీసం సదరు ఏజెన్సీ కూడా టీకాల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఆయా కంపెనీలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ ఘరానా మోసం వెలుగు చూసింది. ఇలాగే కొన్ని అపార్ట్ మెంట్ల కమిటీలు కూడా మోసపోయినట్టు తేలింది. ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాత సురేష్ బాబు కూడా నకిలీ టీకాల ముఠాకు డబ్బులు సమర్పించుకున్నారని సమాచారం.

ఇప్పుడీ మోసం పశ్చిమబెంగాల్ కి కూడా పాకింది. అయితే ఇక్కడ మోసపోయింది ఏకంగా ఓ ఎంపీ కావడం విశేషం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి ఈసారి నకిలీ టీకా ముఠాకు బుక్కయ్యారు. దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి ఈ నకిలీ టీకా వ్యవహారానికి సూత్రధారి. తనకు తాను ఐఏఎస్ ఆఫీసర్ గా ఎంపీ మిమి చక్రవర్తికి పరిచయం చేసుకున్న దేవాంజన్ దేవ్.. వ్యాక్సినేషన్ డ్రైవ్ కు కు ముఖ్య అతిథిగా ఆమెను ఆహ్వానించారు. కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని చెప్పడంతో ఎంపీ గుడ్డిగా నమ్మారు. ఆ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు రిబ్బన్ కట్ చేశారు, తాను కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా ఆమె సెల్ ఫోన్ కు మెసేజ్ రాలేదు. కొవిన్ పోర్టలో ఆమె పేరు కూడా కనిపించలేదు. దీంతో తాను మోసపోయానని ఆమె గుర్తించారు. అంతే కాదు, తనతోపాటు.. చాలామంది మోసపోయేందుకు పరోక్షంగా సహకరించానని కూడా ఆమెకు అర్థమైంది. దీంతో ఎంపీ మిమి చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను బురిడీ కొట్టించిన దేవాంజన్ దేవ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి క్యాంప్ నిర్వహించి 250మందికి టీకాలు వేసినట్టు తేలింది. ఆ టీకాల శాంపిల్స్ పరిశీలించగా వాటిపై ఎక్స్ పయిరీ డేట్ లేదని అర్థమైంది. దీంతో అసలు వారికి వేసింది టీకాలేనా, లేదా సెలైన్ వాటరా అనేది కూడా అనుమానంగా మారింది. గతంలో రెమెడిసెవిర్ ఇంజక్షన్లు, బ్లాక్ ఫంగస్ నివారణకు వాడే మందుల విషయంలో ఇలాంటి మోసాలు జరిగేవి. ఇప్పుడు ఏకంగా టీకాల పేరుతో మోసాలు పెరిగిపోయాయి. సామాన్యులే కాదు, ఏకంగా ఎంపీ స్థాయి వ్యక్తులే మోసపోవడం ఇక్కడ విశేషం.

First Published:  24 Jun 2021 1:37 AM GMT
Next Story