Telugu Global
International

వాషింగ్టన్ లో కాల్పులు.. ఒకరి మృతి.. పోలీసు అధికారి సహా పలువురికి గాయాలు

అమెరికాలో మళ్ళీ గన్ గర్జించింది. వాషింగ్టన్ లో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా పలువురు గాయపడ్డారు. 15 ఏళ్ళ యువకుడు అక్కడికక్కడే మరణించగా.. ఇతరులను ఆసుపత్రికి తరలించారు.. నగరం నడిబొడ్డునగల జూన్ టీన్త్ మ్యూజిక్ కన్సర్ట్ ప్రాంతంలో హఠాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. వైట్ హౌస్ కి కేవలం 2 మైళ్ళ దూరంలో ఉందీ ప్రాంతం.. కాల్పులు జరిపిన అనుమానితుడికోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఈ ఘటనను డీసీ పోలీస్ యూనియన్ […]

gunshot-washington-dc
X

అమెరికాలో మళ్ళీ గన్ గర్జించింది. వాషింగ్టన్ లో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా పలువురు గాయపడ్డారు. 15 ఏళ్ళ యువకుడు అక్కడికక్కడే మరణించగా.. ఇతరులను ఆసుపత్రికి తరలించారు.. నగరం నడిబొడ్డునగల జూన్ టీన్త్ మ్యూజిక్ కన్సర్ట్ ప్రాంతంలో హఠాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. వైట్ హౌస్ కి కేవలం 2 మైళ్ళ దూరంలో ఉందీ ప్రాంతం.. కాల్పులు జరిపిన అనుమానితుడికోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఈ ఘటనను డీసీ పోలీస్ యూనియన్ ధృవీకరిస్తూ ట్వీట్ చేసింది. 14th అండ్ u స్ట్రీట్ ప్రాంతంలో కాల్పులు జరిగాయని పోలీసువర్గాలు తెలిపాయి.

ఈ ఘటనలో గాయపడిన పోలీసు అధికారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది. . దేశంలో కాల్పుల ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, మహిళలను రక్షించవలసి ఉందని, ప్రమాదకరమైన ఆయుధాల వాడకంపై నిషేధాన్ని విధించాల్సి ఉందని అధ్యక్షుడు జోబైడెన్ పదేపదే ప్రకటనలు చేస్తున్నా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే అక్రమ ఆయుధాల అమ్మకాలపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే దేశంలోని రైఫిల్స్ క్లబ్ ప్రాబల్యం దృష్ట్యా ఈ ఆంక్షలు నీటిమీది రాతల్లాగే ఉండిపోతున్నాయి.

పదేళ్లు నిండని కుర్రాళ్లకు సైతం గన్స్ అందుబాటులో ఉంటున్నాయి. గత మే 24 న టెక్సాస్ లోని ఉవాల్డెలో గల ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 19 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. 18 ఏళ్ళ యువకుడొకరు ఈ నరమేధానికి పాల్పడ్డాడు. మే 31 న కూడా న్యూ ఓర్లాన్స్ లో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ సెరిమనీ జరుగుతుండగా ఎవరో కాల్పులు జరపడంతో ఓ వృద్దురాలు మరణించింది. మరో ఇద్దరు గాయపడ్డారు. 2018 లో ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లోని హైస్కూల్లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 17 మంది మృతి చెందారు.

తాజా ఘటనకు సంబంధించి ఈ కన్సర్ట్ కి పోలీసుల అనుమతి లేదని తెలియవచ్చింది. గాయపడి వీధుల్లో పడిఉన్నవారిని పోలీసులు ఆసుపత్రికి తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ కన్సర్ట్ కి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని, ఒక్కసారిగా కాల్పులు జరగడంతో గాయపడిన పోలీసు అధికారి తన గన్ ని వాడలేకపోయాడని సమాచారం. పోలీసులు జనాల గుంపును మేనేజ్ చేయడానికి యత్నించినప్పటికీ 15 ఏళ్ళ యువకుడి ప్రాణాలను కాపాడలేకపోయారని వాషింగ్టన్ మేయర్ మురీల్ బౌసర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఎవరో బాధ్యులై ఉంటారని ఆమె అన్నారు. సుమారు 100 మంది పోలీసు అధికారులు ఆ సమయంలో అక్కడే ఉన్నట్టు అంచనా..

First Published:  19 Jun 2022 11:20 PM GMT
Next Story