Telugu Global
Andhra Pradesh

అన్నివైపుల నుండి బిగించేస్తున్నారా?

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చటంలో క్విడ్ ప్రో కో వ్యవహారం దాగుందని సీఐడీ ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగానే లోకేష్‌ను ఏ 14గా కేసు నమోదు చేసిన సీఐడీ తాజాగా నారావారి కుటుంబ సంస్థ‌ హెరిటేజ్‌పైన కూడా కేసు బుక్ చేసింది.

అన్నివైపుల నుండి బిగించేస్తున్నారా?
X

ఏ ముహూర్తంలో నారా భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీలో తనకున్న వాటాలో 2 శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని చెప్పారోకానీ వెంటనే హెరిటేజ్ కంపెనీపైన ప్రభుత్వం కేసు నమోదుచేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చటంలో క్విడ్ ప్రో కో వ్యవహారం దాగుందని సీఐడీ ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగానే లోకేష్‌ను ఏ 14గా కేసు నమోదు చేసిన సీఐడీ తాజాగా నారావారి కుటుంబ సంస్థ‌ హెరిటేజ్‌పైన కూడా కేసు బుక్ చేసింది.

అమరావతి ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ‌ కూడా పెద్దఎత్తున భూములు తీసుకున్నది. సంస్థ కొనుగోలు చేసిన భూములు రియల్టర్ లింగమనేని రమేష్‌వే. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు భూముల మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం మూడుసార్లు మార్చింది కూడా రమేష్ ఫాంహౌస్‌లోని సుమారు 370 ఎకరాల భూముల విలువ అమాంతం పెరగటం కోసమే అనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఫాం హౌస్ దగ్గరకు వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ ఆగిపోయింది. నిజానికి ఇన్నర్ రింగ్ రోడ్డు వేయలేదు.

అయితే వేస్తామని చెప్పి, ఒకటికి మూడుసార్లు రింగ్ రోడ్డు ప్లాన్ మార్చింది రమేష్‌తో పాటు తమ భూముల విలువలు పెంచుకోవటం కోసమే అనేది చంద్రబాబు, లోకేష్ మీదున్న ఆరోపణలు. రాజధాని నూజివీడు దగ్గర వస్తుందని అక్కడ వస్తుందని, ఇక్కడ వస్తుందని చాలా వార్తలు వచ్చాయి. ఒక్కోసారి ఒక్కో వార్త వచ్చినపుడల్లా ఆ ప్రాంతంలో భూముల ధ‌రలు పెరిగిపోయేవి. తర్వాత అక్కడ రావటంలేదని చెప్పేసరికి భూముల ధరలు తగ్గిపోయేవి. అంటే కొంతమంది భూముల ధరలు పెంచేందుకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించిందని జనాలు కూడా చెప్పుకునేవాళ్ళు.

అక్కడొస్తుందని ఇక్కడొస్తుందని చెప్పి తమ వాళ్ళందరితో అమరావతి ప్రాంతంలో భూములు కొనిపించేసి తర్వాత ఎప్పుడో అమరావతే రాజధాని అని చంద్రబాబు ప్రకటించారని సీఐడీ ఆరోపిస్తోంది. ఇందులో నిజముందని అప్పట్లో జనాలు కూడా చెప్పుకున్నారు. అందులో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో ప్రభుత్వం చాలా డ్రామాలాడింది.

హెరిటేజ్ కంపెనీ లింగమనేని దగ్గర నుండి సుమారు 15 ఎకరాలు కొన్నది. భూములు కొనాలని నిర్ణయించిన హెరిటేజ్ కంపెనీ బోర్డులో నారా లోకేష్ కూడా డైరెక్టరే. అలాగే రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వంలో లోకేష్ మంత్రి. అంటే లోకేష్ ఇటు హెరిటేజ్ కంపెనీతో పాటు మంత్రిగా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించాడన్నది స్పష్టం. మామూలుగా అయితే మంత్రికాగానే ఎవరైనా తమ డైరెక్టర్ పోస్టును వదులుకుంటారు. కానీ లోకేష్ మాత్రం రెండు పోస్టుల్లోనూ ఏకకాలంలో కంటిన్యూ అవటమే ఇప్పుడు తలనొప్పిగా మారింది.

First Published:  27 Sep 2023 5:10 AM GMT
Next Story